‘నేనెప్పుడూ మంచి కథలో, మంచి సినిమాలో నటుడిగా భాగం కావాలని కోరుకుంటాను. నా క్యారెక్టర్ నిడివి ఎంత అనేది చూసుకోను. బాగాలేని సినిమాలో మూడు గంటలు కనిపించే కంటే ఓ మంచి సినిమాలో బాగా కుదిరాడు, బాగా నటించాడనే పేరొస్తే చాలు. మార్కెట్, కమర్షియాలిటీ వీటన్నింటి కంటే నాలాంటి నటులను ఒక మంచి సినిమానే ముందుకు తీసుకెళ్తుందని బలంగా నమ్ముతాను’ అన్నారు యంగ్ హీరో, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ రాజ్. డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజు ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘క్రేజీ కల్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించాడు. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా అఖిల్ రాజ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
→ ప్రొడ్యూసర్ జగన్ మోహన్ రెడ్డి నిర్మాణంలో విందు భోజనం అనే సినిమా చేశాను. అప్పటి నుంచి ఆ సంస్థతో, వారితో టచ్ లో ఉంటూ వచ్చాను. క్రేజీ కల్యాణం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నప్పుడు పిచ్ డెక్ లో ఈ సినిమాలోని ఉదయ్ పాత్రకు నన్ను అనుకున్నారు. అప్పటికి ఇంకా ఈ సినిమా కాస్టింగ్ లోకి ఎవరూ కన్ఫర్మ్ కాలేదు. ఉదయ్ క్యారెక్టర్ నువ్వు చేస్తావా అని డైరెక్టర్, ప్రొడ్యూసర్ అడిగారు. చేస్తానని చెప్పాను. ఆ తర్వాత నరేష్ , అనుపమ, తరుణ్ భాస్కర్..ఇలా వీళ్లంతా కాస్టింగ్ కన్ఫర్మ్ అయ్యారు.
→ తరుణ్ భాస్కర్ చేసిన బాలరాజు క్యారెక్టర్ హిలేరియస్ గా అనిపించింది. నా క్యారెక్టర్ కు ఫన్ అండ్ లవ్ సీన్స్ ఉంటాయి. నరేష్, తరుణ్ భాస్కర్ క్యారెక్టర్స్ కు ధీటుగా నా క్యారెక్టర్ ను పర్ ఫార్మెన్స్ తో నిలబెట్టాలని అనుకున్నాను. నన్ను ఏం ఆశించి బద్రప్ప అన్న తీసుకున్నాడో గానీ వందశాతం ఉదయ్ గా కనిపించేందుకు ప్రయత్నించాను. రాజు వెడ్స్ రాంబాయి రిలీజ్ కు ముందే ఈ చిత్రంతో నరేష్ గారు, అనుపమ, తరుణ్ భాస్కర్ తో కలిసి నటించే అవకాశం రావడం హ్యాపీగా ఫీలవుతున్నా.
→ రౌడీ బాయ్స్ సినిమాలో అనుపమ హీరోయిన్ గా నటించింది. నేను చిన్న రోల్ చేశాను. ఆ సినిమా చూస్తున్నప్పుడు నువ్వు హీరో అయ్యాక ఈ అమ్మాయితో కలిసి నటించు అని మా అమ్మ చెప్పింది. ఆమె కోరుకున్నట్లే అనుపమతో నేను ఈ సినిమాలో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. అయితే ఆమెతో కలిసి నటించడం మొదట్లో భయమేసింది గానీ తను ఇచ్చిన సపోర్ట్ తో హాఫ్ డేలోనే కంఫర్ట్ గా ఫీలయ్యా. ప్రతి సీన్ చేసే ముందు నేను అనుపమ ఎవరెలా చేయాలనేది డిస్కస్ చేసుకునేవాళ్లం. మేము నటీనటులుగా కాకుండా ఆ క్యారెక్టర్స్ లా చూసుకున్నాం. నేను ఏ సినిమా చేసినా వందశాతం ఎఫర్డ్స్ పెడతాను.
→ రాజ్ వెడ్స్ రాంబాయిలో రాజు గా ఎంత ఇన్వాల్వ్ అయి నటించానో ఈ సినిమాలో ఉదయ్ పాత్రలోనూ అంతే హోమ్ వర్క్ చేసి పర్ ఫార్మ్ చేశాను. రాజు వెడ్స్ రాంబాయి లాగే ఈ చిత్రంలో కూడా పక్కింటి కుర్రాడిలాగే కనిపిస్తా. డిగ్రీ పూర్తి చేసుకున్న ఉదయ్ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలనే లక్ష్యాన్ని పెట్టుకుంటాడు. ఉదయ్ పాత్రను ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకుంటారు. ఉదయ్ అనే పాత్రలో ఒక ఎనర్జీ ఉంది. అది చాలా బాగుంటుందని నేను నమ్మాను.
→ నాకు అనుపమకు మధ్య అలసెంద్రవంక సాంగ్ ఉంటుంది. ఆ పాటను డా.గోరటి వెంకన్న గారు రాయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది తెలంగాణ నేపథ్య, యాసతో సాగే సినిమా అయినా అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉన్నాయి. కంటెంట్ బాగున్న సినిమా విజయానికి యాస, ప్రాంతం అనే బేధాలు అడ్డురావు. పెళ్లిచూపులు సినిమా తెలంగాణతో పాటు ఏపీ ప్రజలు కూడా ఆదరించారు.
→ మనం ఒక లక్ష్యాన్ని నమ్మి కష్టపడి పనిచేస్తే తప్పకుండా రీచ్ అవుతామని నా జర్నీలో తెలుసుకున్నాను. ఈ పండక్కి వచ్చే అన్ని సినిమాలు ఎంజాయ్ చేయండి. మా సినిమాను కూడా థియేటర్స్ కు వెళ్లి చూడండి. మా క్రేజీ కల్యాణం చూస్తూ మీ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తారు. మా సినిమా ఏ స్టార్ సినిమాకు పోటీ అనుకోవడం లేదు. వాళ్ల సినిమాలు బిర్యానీ అయితే మా సినిమా స్వీట్ లాంటిది. పండక్కి ఎన్ని సినిమాలైనా ఆదరణ పొందుతాయి. నా నెక్ట్స్ మూవీ శనార్తి. శనార్తి రూటెడ్ కోర్ కల్ట్ సినిమా అవుతుందని నమ్ముతున్నా.


