
అడివి శేష్.. ఈ పేరు వినిపించి, స్క్రీన్‌పై ఇతడిని చూసి చాలా ఏళ్లయిపోయింది. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్ హీరోలందరూ హిట్టో ఫ్లాఫో సంగతి పక్కనబెడితే ఎప్పటికప్పుడు ఏదో ఓ సినిమా చేస్తూ ప్రేక్షకుల్ని పలకరిస్తున్నారు. ఇతడు మాత్రం దాదాపు మూడేళ్ల నుంచి ఒక్క మూవీని కూడా తీసుకురావట్లేదు. ఈ ఏడాదైనా వస్తాడనుకుంటే ఈసారి కూడా పలు కారణాల వల్ల హ్యాండిచ్చేసినట్లు తెలుస్తోంది.
క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ 2.. ఇలా వరస సినిమాలతో శేష్.. సక్సెస్ అందుకున్నాడు. మరి కారణాలేంటో తెలీదు గానీ 2022 డిసెంబరులో హిట్ 2 రిలీజైంది. తర్వాత గూఢచారి, డకాయిట్ అనే చిత్రాల్ని ప్రకటించాడు. అప్పటినుంచి అవి సెట్స్‌పైనే ఉన్నాయి. లెక్క ప్రకారం 'డకాయిట్' మూవీ ఈపాటికే రిలీజైపోవాలి. తొలుత శ్రుతిహాసన్‌తో ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు. ఎక్కడ తేడా కొట్టిందో గానీ శ్రుతి ప్లేసులోకి మృణాల్ ఠాకుర్ వచ్చింది. ఈ ఏడాది క్రిస్మస్ రిలీజ్ అని పోస్టర్ కూడా అధికారికంగా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడిది వాయిదా పడ్డట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9.. ఈసారి నామినేషన్లలో ఎవరెవరంటే?)
శేష్ గతంలో ఓసారి గాయపడ్డాడు. అయితే అది ఇంకా తగ్గే దశలో ఉందని, దీంతో షూటింగ్స్ పూర్తవక 'డకాయిట్' వాయిదా పడనుందనే రూమర్స్ వస్తున్నాయి. త్వరలో కొత్త విడుదల తేదీని కూడా టీమ్ ప్రకటించనుందని తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం వచ్చే ఏడాది మే 1న విడుదల కావాల్సిన 'గూఢచారి 2' కూడా కచ్చితంగా వాయిదా పడే అవకాశముంది. మరి ఏం జరుగుతుందో చూడాలి?
శేష్ మంచి నటుడే కావొచ్చు. కానీ ఎప్పటికప్పుడు ఒకటి అరా సినిమాలు చేస్తుంటే ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు. లేదంటే మర్చిపోయే అవకాశాలు ఎక్కువ. మళ్లీ రిలీజ్ టైంలో ప్రమోషన్లలో హడావుడి చేసినా సరే ఎవరా హీరో అని అనుకోవచ్చు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ రెండు సినిమాలని థియేటర్లలోకి తీసుకొచ్చి శేష్.. హిట్ కొట్టాల్సిన అవసరముంది!
(ఇదీ చదవండి: 'కాంతార 1'లో రిషభ్ శెట్టి భార్య కూడా నటించింది.. గుర్తుపట్టారా?)