Tamannaah Bhatia Marriage: త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న తమన్నా.. వరుడు ఎవరంటే?

మిల్కీ బ్యూటీ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు తమన్నా. అభిమానుల్లో అంతలా పేరు సంపాదించుకుంది ఈ భామ. శ్రీ మూవీతో తెలుగు తెరపై మెరిసిన ఈ పంజాబీ భామ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో తనదైన నటనతో ముద్ర వేసిన తమన్నాపై ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ముంబై ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే తమన్నా చేసుకోబోయే వ్యక్తి ఎవరన్నా దానిపైనే నెట్టింట్లో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది.
(చదవండి: తమన్నాకు చెస్ ఆట నేర్పిస్తున్న ప్రభాస్, వైరల్‌గా త్రోబ్యాక్ వీడియో)
తమన్నా భాటియా త్వరలో ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అందువల్లే కొత్త ప్రాజెక్టులకు సంతకం చేయడం లేదని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ వార్తలను ఆమె ఇప్పటివరకు ఖండించకపోవడంతో త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు.
గతంలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో తన తల్లిదండ్రులే నిర్ణయిస్తారని చెబుతూ వస్తోంది మిల్క్ బ్యూటీ. ముంబైకి చెందిన తమన్నా భాటియా.. దక్షిణ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె టాలీవుడ్‌లో నటించిన చిత్రాల్లో అనేక సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఆమె కెరీర్‌లో భారీహిట్‌గా నిలిచిన చిత్రం 'బాహుబలి'. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా భాటియా పెళ్లికి ప్రజలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. ఆమె 14 ఏళ్ల వయస్సులోనే సినిమాల్లో నటించడం ప్రారంభించింది. కాగా.. తమన్నా ప్రస్తుతం భోళా శంకర్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటిస్తోంది. మరోవైపు ఓ తమిళ చిత్రంలోనూ కనిపించనుంది.