Lara Dutta Love Story: ఇద్దరితో తెగతెంపులు, ఆల్‌రెడీ పెళ్లైన టెన్నిస్‌ స్టార్‌తో నటి వివాహం

Actress Lara Dutta Tennis Star Mahesh Bhupathi Love Story - Sakshi

మిస్‌ యూనివర్స్, మోడల్, నటిగా లారా దత్తా జగమంతా పరిచయం. టాప్‌ టెన్నిస్‌ స్టార్‌గా మహేశ్‌ భూపతి కూడా ప్రపంచానికి తెలుసు! ఈ ఇద్దరూ ఒకరితో ఒకరు ఎదురుపడే వరకూ ఒకరి గురించి ఒకరు వినే ఉన్నారు.. ముఖ పరిచయం తక్షణమే ఒకరి ప్రేమలో ఒకరు పడ్డారు! ఆ కథే ఇక్కడ ‘మొహబ్బతే’గా.. 

విశ్వసుందరిగా లారా దత్తా ప్రపంచానికి తెలిసేటప్పటికే ఆమె జీవితంలో ఉన్న స్నేహితుడు, సహచరుడు కెల్లీ దోర్జీ. భూటాన్‌ దేశస్థుడు. ముంబై బేస్డ్‌ మోడల్‌. ఆ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని భావించారు వారి అనుబంధం గురించి తెలిసినవాళ్లంతా. తొమ్మిదేళ్ల డేటింగ్‌ తర్వాత హఠాత్తుగా లారా ప్రవర్తనను విమర్శించడం మొదలుపెట్టాడు కెల్లీ. ప్రముఖ మోడల్, నటుడు డినో మోరియాతో ఆమె సన్నిహితంగా మెదులుతోందంటూ. ఆ విమర్శలు తర్వాత ఆరోపణలుగా మారి.. ఆఖరకు ఆ రిలేషన్‌ బ్రేక్‌ అయిపోయింది. కెల్లీ ఊహించినట్టుగా డినో మోరియాతో లారా పెద్దగా కలసిలేదు. సంతోషంగానూ ఉన్నట్టు లేదు. డినో పక్కన నందితా మహంతి అనే అమ్మాయి పేరు జత కూడింది. ఆ రూమర్‌ని డినో మోరియా ఖండించలేదు. లారా హర్ట్‌ అయింది. అతనితోనూ తెగతెంపులు చేసుకుంది. 

అలాంటి గందరగోళ పరిస్థితుల్లోనే మహేశ్‌ భూపతితో ఆమెకు ములాఖాత్‌ అయింది. మహేశ్‌ భూపతి స్పోర్ట్స్‌ కంపెనీలో ఈ ఇద్దరికీ  ముఖాముఖి పరిచయం అయింది.  ఆ మీటింగ్‌ ఏదో యాడ్‌కి సంబంధించి అని ప్రచారంలో ఉంది కానీ.. నిజానికి లారాను కలవడానికే మహేశ్‌ ఆ మీటింగ్‌ను ఏర్పాటు చేశాడు.. యాడ్‌ అనేది ఓ మిష మాత్రమే అని అంటారు మహేశ్‌ భూపతి సన్నిహితలు. మొత్తానికి తొలి పరిచయంలోనే మహేశ్‌ సింప్లిసిటీకి ముగ్ధురాలైపోయింది లారా. అప్పటికే లారా మీద మనసు పడి ఉన్నాడు కాబట్టి మహేశ్‌ కూడా ఆమె పట్ల మరింత ఆకర్షితుడై పోయాడు. అలా వాళ్ల ప్రేమ మొదలైంది. కొన్ని రోజుల్లోనే పరస్పరం ఆ ప్రేమను ప్రకటించుకు న్నారు.

కానీ అంతా సవ్యంగా సాగడానికి అదివరకే మహేశ్‌ వివాహితుడవడం ఓ అడ్డంకిగా మారింది. లారా.. మహేశ్‌ ఊహకు అందకముందే (2002) అతనికి మోడల్‌ శ్వేతా జైశంకర్‌తో పెళ్లయింది. ఏడేళ్ల ఆ బంధం మహేశ్‌కు లారా మీద పుట్టిన ప్రేమతో పలచనైంది. లారాతోనే తతిమా జీవితపు ప్రయాణం అని మహేశ్‌ నిర్ణయించుకునేసరికి.. విడాకులతో శ్వేత అతనికి ఆ నిర్ణయాన్ని అమలుపర్చుకునే స్వేచ్ఛనిచ్చింది. కానీ లారాకు ‘హోమ్‌ బ్రేకర్‌’ అనే అపవాదు తప్పలేదు. మహేశ్‌ భూపతి కోసం ఆ అపవాదును మోసింది ఆమె.

‘ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే నేను, మహేశ్‌ ఇద్దరం ఓ ఒప్పందం చేసుకున్నాం. సాధ్యమైనంత వరకు ఇద్దరం కలిసే బిడ్డను పెంచాలి. అది సాధ్యంకాని పక్షంలో మా ఇద్దరిలో కచ్చితంగా ఎవరో ఒకరైతే  బిడ్డను చూసుకోవాలని. పదేళ్లుగా ఆ ఒప్పందాన్ని తు.చ తప్పకుండా పాటిస్తున్నాం’ అని చెప్పింది లారా దత్తా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. 

కొన్నాళ్ల డేటింగ్‌ తర్వాత...
2011, ఫిబ్రవరి 16న.. అంటే వాలంటైన్స్‌ డే అయిన రెండు రోజులకు మహేశ్‌ భూపతి, లారా దత్తా ఒకింటివారయ్యారు. ముంబైలో ఫిబ్రవరి పదహారున అత్యంత సన్నిహితుల మధ్య హిందూ సంప్రదాయం ప్రకారం, తర్వాత ఫిబ్రవరి 20న గోవాలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. మహేశ్‌ భూపతి మాజీ భార్య శ్వేత కూడా చెన్నైకి చెందిన రఘు కైలాస్‌ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. వాళ్లకు ఇద్దరు పిల్లలు.  మహేశ్‌ భూపతి, లారా దత్తా దంపతులకూ ఓ కూతురు. పేరు సైరా.
- ఎస్సార్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top