
బుల్లితెర నటి లహరి రాఘవేందర్ (Actress Lahari Raghavendar) తల్లిగా ప్రమోషన్ పొందింది. శనివారం (జూలై 26) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించింది. దీంతో అభిమానులు నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. లహరి రాఘవేందర్.. కోయిలమ్మ సీరియల్‌లో సింధుగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. కళ్యాణ వైభోగం, కన్యాదానం, రాధమ్మ కూతురు, అమ్మ, అల వైకుంఠపురములో వంటి పలు ధారావాహికలు చేసింది.
ఉద్యోగం, సీరియల్స్
పలు షార్ట్ ఫిలింస్‌లో కూడా నటించింది. అయితే లహరి కొంతకాలంగా సీరియల్స్‌కు దూరంగా ఉంటూ వస్తోంది. అందుకుగల కారణాన్ని ఇటీవల తన యూట్యూబ్ ఛానల్‌లో వెల్లడించింది. నేను ఓ పక్క ఉద్యోగం చేసుకుంటూనే సీరియల్స్ చేశాను. దాదాపు ఐదేళ్లపాటు రెండింటినీ మ్యానేజ్ చేశాను. షూటింగ్ గ్యాప్స్‌లో ల్యాప్‌టాప్ పట్టుకుని కూర్చునేదాన్ని. అమ్మ నన్ను కష్టపడి చదివించినప్పుడు ఉద్యోగం మానేయడం కరెక్ట్ కాదనిపించింది.
చీప్‌గా చూస్తున్నారనే..
ఇకపోతే సీరియల్స్‌లో ఏమైపోయిందంటే, బెంగళూరు నుంచే ప్రతి ఒక్కరినీ తీసుకునిరావడం మొదలైంది. దాంతో ఇక్కడున్నవారికి డిమాండ్ తగ్గిపోయింది. నేను అడిగినంత ఇచ్చేందుకు కూడా వెనుకాడారు. ఇతర భాషల నుంచి వచ్చే నటీనటుల కోసం ఇక్కడున్న మాకు పారితోషికం తగ్గించడమేంటి? మమ్మల్ని చీప్‌గా చూడటమేంటి? అనిపించి ఓ సీరియల్ కూడా వదిలేసుకున్నాను.
ఒక్కమాటైనా చెప్పకుండా..
వేరే సీరియల్స్‌లో మంచి పాత్రలు పడ్డాయి, కెరీర్ బాగుంది కదా అని నా ఉద్యోగాన్ని వదిలేసుకుంటే చివరకు నాకే షాకిచ్చారు. నాకు ఒక్కమాటైనా చెప్పకుండా ఓ సీరియల్‌లో నుంచి సడన్‌గా తీసేశారు. అది నాకు నచ్చలేదు. ఇవన్నీ చూశాక.. ఇక చాలు, సీరియల్స్ ఆపేద్దామని నిర్ణయించుకున్నాను. అందుకే తిరిగి మళ్లీ ఉద్యోగంలో చేరాను అని చెప్పుకొచ్చింది.
చదవండి: పిల్లలు కావాలి.. వాళ్లతో ఎంజాయ్ చేయాలనుంది: నాగచైతన్య