
ప్రస్తుతం మనలో చాలామందిని వేధిస్తున్న సమస్య బరువు. అరె ఇలా అయిపోయామేంటి? వెంటనే ఎక్సర్‌సైజ్ చేయాలి, సన్నగా అవ్వాలని అనుకుంటాం. కానీ దాన్ని అమల్లోకి తీసుకొచ్చేటప్పుడు చాలా కష్టాలు పడుతుంటాం. కానీ ఒకప్పటి హీరోయిన్ ఖుష్బూ మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు ఉంది. తను మాత్రమే కాదు తన కుటుంబాన్ని కూడా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేలా చేసింది. దీంతో ఇప్పుడు ఈమె కుటుంబాన్ని చూసి అందరూ షాకవుతున్నారు.
దక్షిణాదిలో దాదాపు అన్ని భాషల్లో సినిమాలు చేసిన ఖుష్బూ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తమిళ దర్శకుడు సుందర్‌ని పెళ్లి చేసుకున్న ఈమెకు ఇద్దరు కుమార్తెలు అవంతిక, ఆనందిత కూడా ఉన్నారు. గతంలో ఖుష్బూతో పాటు కూతుళ్లు కూడా కాస్త లావుగా కనిపించేవారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు ట్రోల్స్ వచ్చేవి. బరువుపై పలువురు నెటిజన్లు కామెంట్స్ చేసేవాళ్లు. మరి ఈ విషయాన్ని ఖుష్బూ చాలా సీరియస్‌గా తీసుకున్నట్లుంది.
(ఇదీ చదవండి: ‘త్రిబాణధారి బార్బరిక్’ రివ్యూ)
ఏడాది తిరిగేలోపు ఖుష్బూ కుటుంబంలోని అందరూ లుక్ మార్చేశారు. పైన కనిపిస్తున్న ఫొటోల్లో ఒకటి గతేడాది సెప్టెంబరులో తీసుకున్నది. ఇందులో అందరూ కాస్త బొద్దుగా కనిపించారు. ఇప్పుడు సరిగ్గా ఏడాది తర్వాత అందరూ సన్నగా మారిపోయి కనిపించారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఖుష్బూ తన ఫ్యామిలీ ఫొటోని పోస్ట్ చేసింది. ఇది చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇంతలోనే ఇంత మార్పు అని మాట్లాడుకుంటున్నారు.
చాన్నాళ్ల క్రితమే యాక్టింగ్ పక్కనబెట్టిన ఖుష్బూ.. ఓవైపు రాజకీయాల్లోనూ ఉంటూనే మరోవైపు 'జబర్దస్త్' లాంటి రియాలిటీ షోల్లో జడ్జిగా కనిపిస్తోంది. ఈమె కూతుళ్లు కూడా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బహుశా అందుకే అందరూ ఒకేసారి ఇలా లుక్ మార్చి కనిపించారా అనే సందేహం వస్తోంది.
(ఇదీ చదవండి: స్టేజీపై హీరో షాకింగ్ ప్రవర్తన.. హీరోయిన్ నడుము తాకుతా)