
టాలీవుడ్‌లో ప్రతివారం కొత్త సినిమాలు వస్తున్నా..వాటిల్లో కొన్ని మాత్రమే రిలీజ్‌కి ముందు అటెన్షన్‌ని గ్రాప్ చేస్తాయి. అలా విడుదలకు ముందే బజ్ క్రియేట్ చేసుకున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించాడు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో విజయ్ పాల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు(ఆగస్ట్ ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
ఆగస్ట్ 15న ప్రముఖ సైకాలజిస్ట్ శ్యామ్ కతు(సత్యరాజ్) మనవరాలు నిధి(మేఘన) కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయిస్తాడు. ఈ కేసుని కానిస్టేబుల్ చంద్ర(సత్యం రాజేశ్) డీల్ చేస్తుంటాడు. మరోవైపు మధ్యతరగతి కుటుంబానికి చెందిన రామ్(వశిష్ట సింహా) విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. దానికోసం రూ.30 లక్షల వరకు కావాల్సి ఉంటుంది. తన స్నేహితుడు, లేడీ డాన్ వాలికి పద్మ(ఉదయ భాను) మేనల్లుడు దేవ్(క్రాంతి కిరణ్)తో కలిసి ఇష్టం లేకపోయిన కొన్ని అసాంఘీక పనులు చేస్తుంటాడు.
దేవ్‌కి జూదం అంటే పిచ్చి. అత్త వాకిలి పద్మకు తెలియకుండా డ్రగ్స్ మాఫియా లీడర్ దాస్(మొట్ట రాజేంద్రన్) దగ్గర లక్షల్లో అప్పు చేసి జూదంలో పొగొట్టుకుంటాడు. కొన్నాళ్ల తర్వాత దాస్ తన అప్పు తీర్చమని దేవ్‌పై ఒత్తిడి చేస్తాడు. దీంతో డబ్బు కోసం రామ్ ఓ ప్లాన్ వేస్తాడు. అదేంటి? నిధి మిస్సింగ్‌కి వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు నిధిని కిడ్నాప్ చేసిందెవరు? ఎందుకు చేశారు? మనవరాలి కోసం శ్యామ్ ఏం చేశాడు? అనేది తెలియాంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే...
టైటిల్‌ని చూసి ఇదేదో మైథాలాజికల్ ఫిల్మ్ అనుకుంటారు. కానీ ఇది రొటీన్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దానికి కాస్త మైథాలాజికల్ టచ్ ఇచ్చి డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ విషయంలో ఆయన కాస్త సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కథ రొటీనే అయినా కథనం మాత్రం కొత్తగా ఉంటుంది. ఒకేసారి రెండు డిఫరెంట్ కథలను చెబుతూ..చివరిలో ఆ రెంటింటికి మధ్య ఉన్న సంబంధం రివీల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఈ రెండు ఎపిసోడ్స్‌కి మధ్య లింక్ ఉంటుందని ఊహించినా.. ఆ లింకుని ఎలా చూస్తాడనే అనే క్యూరియాసిటీని మాత్రం చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు విజయం సాధించాడు.
మహా భారతంలో ఘటోత్కచుని కొడుకు బార్బరీకుడు త్రిబాణంతో కురుక్షేత్రంను ఆపగలడు. ఆయన దగ్గర ఉండే మూడు బాణాలకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటిని తెలియజేస్తూ ఆసక్తికరంగా కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత తాత-మనవరాలి స్టోరీని పాటలోనే ఎమోషనల్‌గా చూపించారు. అదే సమయంలో మరో ఎపిసోడ్‌లో సత్యతో రామ్ లవ్ స్టోరి..వాలికి పద్మ నేపథ్యం, దాస్ డ్రగ్స్ దందా..ఇవన్నీ చూపిస్తూ.. కథనంపై ఆసక్తిని పెంచేశాడు.
నిధికి ఏమైంది? ఎవరు కిడ్నాప్ చేశారు? అమ్మాయి ప్రాణాలతో ఉందా? రామ్‌కి 30 లక్షలు దొరుకుతాయా? రామ్ స్నేహితుడు అప్పు నుంచి బయట పడతాడా? అంటూ ఇలా చాలా లేయర్లతో కథనం ముందుకు సాగుతుంది. ఇంటర్వెల్‌కు వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్ మొత్తం రివేంజ్ డ్రామా. తన మనవరాలి మరణానికి తాత చేసే న్యాయం ఏంటి? అన్నది ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు బాగుంటాయి. పరిస్థితుల వల్ల మనుషులు ఎలా మారిపోతారు? అన్నది ఇందులో గొప్పగా చూపించారు. రాముడి వేషంలో రావణుడిలా మన చుట్టూ ఉన్న వాళ్ళని కనిపెట్టాలి అంటూ అమ్మాయిలకు మంచి సందేశం కూడా ఇచ్చారు.
ఎవరెలా చేశారంటే..
సైక్రియార్టిస్ట్ శ్యామ్ పాత్రకి సత్య రాజ్ న్యాయం చేశాడు. ఇక ఈ మూవీలో వశిష్ట పాత్ర అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. రకరకాల వేరియేషన్స్‌తో వశిష్ట మరోసారి అందరినీ మెప్పించేస్తారు. కొత్త కుర్రాడు క్రాంతి కిరణ్ కూడా ఆకట్టుకుంటాడు. ఉదయభానుకి చాలా రోజుల తరువాత ఓ మంచి పాత్ర పడినట్టు అనిపిస్తుంది. అయితే ఆమె పాత్ర నిడివి మాత్రం కాస్త తక్కువే. సత్యం రాజేష్, సాంచీ రాయ్, మేఘన, కార్తికేయ పాత్రలు ఇలా అన్నీ కూడా బాగానే ఉంటాయి. ఇక కామెడీ కోసం తీసుకున్న వీటీవీ గణేష్, మొట్టా రాజేంద్రన్ కారెక్టర్స్ కూడా ఆకట్టుకుంటాయి.
సాంకేతికంగా ఈ సినిమా బాగుంది.ఇన్ ఫ్యూజన్ బ్యాండ్ ఇచ్చిన నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన స్క్రీన్‌ప్లేతో సినిమా స్థాయిని పెంచేశారు. పాటలు పర్వాలేదు. కుశేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. మాటలు చాలా చోట్ల హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. ఎడిటింగ్ పర్వాలేదు. తొలి సినిమానే అయినా సెల్యూలాయిడ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ గొప్పగా ఉన్నాయి. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది.