టైటిల్: 12 ఏ రైల్వే కాలనీ
నటీనటులు: అల్లరి నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి
కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ & షోరన్నర్: డాక్టర్ అనిల్ విశ్వనాథ్
ఎడిటర్ & డైరెక్టర్: నాని కాసరగడ్డ
నిర్మాణ సంస్థ:శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
విడుదల తేది: నవంబర్ 21, 2025
అల్లరి నరేశ్ ఖాతాలో హిట్ పడి చాలా రోజులవుతుంది. కామెడీ వదిలి సీరియస్ సబ్జెక్టులతో చ్చినా.. సరైన విజయం అందడం లేదు. దీంతో ఈ సారి థ్రిల్లర్ జానర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ‘12 ఏ రైల్వే కాలనీ’. పోలిమేర సిరీస్ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పని చేసిన ఈ చిత్రం నేడు(నవంబర్ 21) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
వరంగల్‌లోని రైల్వే కాలనీకి చెందిన కార్తిక్(నరేశ్) ఓ అనాథ. స్నేహితులతో(హర్ష, గెటప్ శ్రీను, సద్దాం) కలిసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వరంగల్ టిల్లు(జీవన్ కుమార్) దగ్గర పని చేస్తుంటారు. అదే కాలనీలో ఉంటున్న ఆరాధన(కామాక్షి భాస్కర్ల)తో ప్రేమలో పడతాడు. ఆరాధన మాత్రం కార్తిక్‌ని పట్టించుకోదు. ఎలెక్షన్స్‌కి మూడు రోజుల ముందు టిల్లు..కార్తిక్‌ని పిలిచి ఓ కవర్ ఇస్తాడు. అది ఓపెన్ చేయొద్దని..ఎవరికి తెలియకుండా దాచాలని చెబుతాడు. ఆ కవర్‌ని తన ఇంట్లో దాచుదామని తీసుకెళ్తుండగా..పోలీసులు రైడింగ్‌కు వస్తున్నారనే విషయం తెలుస్తుంది.
దీంతో రెండు, మూడు రోజులుగా తాళం వేసి ఉన్న ఆరాధన ఇంట్లో అది దాచాలనుకుంటాడు. దొంగచాటుగా ఆ ఇంట్లోకి వెళ్లిన కార్తిక్‌కి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. మూడు రోజుల క్రితమే ఆరాధన, ఆమె తల్లిని ఎవరో దారుణంగా హత్య చేస్తారు. ఆ హత్య చేసిందెవరు? వారి లక్ష్యం ఏంటి? అసలు ఆరాధన ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? ముంబైలో ఉన్న డాక్టర్ షిండే(అనీష్ కురువిల్లా)కి ఆరాధనకు ఉన్న సంబంధం ఏంటి? చనిపోయిన ఆరాధన..కార్తిక్‌కి మాత్రమే ఎందుకు కనిపించింది? ఈ మర్డర్ మిస్టరీని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రానా ప్రతాప్ (సాయి కుమార్) ఎలా ఛేదించాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
'మా ఊరి పొలిమేర', 'పొలిమేర 2' లాంటి సినిమాలు విజయం సాధించడంలో స్క్రీన్‌ప్లే కీలక పాత్ర పోషించింది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. అలాంటి సినిమాలు అందించిన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ మాటలు, స్క్రీన్‌ప్లే అందించిన చిత్రం కావడంతో ‘12 ఏ రైల్వే కాలనీ’పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ అంతగా ఆకట్టుకోకపోయినా.. స్క్రీన్‌ప్లేతో ఏదో మ్యాజిక్ చేస్తాడులే అనుకున్నారు. కానీ ఆడియన్స్ అంచనాలను అందుకోవడంతో ఈ చిత్రం ఘోరంగా విఫలం అయింది.
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఎగ్జైట్ చేయలేదు. పైగా ఈ చిత్రానికి అసలు 12ఏ రైల్వే కాలనీ అని టైటిల్ ఎందుకు పెట్టారో.. తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడించారో అర్థమే కాదు. పోనీ.. ఆ యాసనైనా సరిగా వర్కౌట్ అయిందా అంటే అదీ లేదు. ఏదో అరువు తెచ్చుకున్నట్లుగా అనిపిస్తుంది.
ఇక కథ విషయానికొస్తే.. అసలు దర్శకుడు ఏం చెప్పి నరేశ్‌ని ఒప్పించాడో అర్థమే కాదు. ఒకటి రెండు ట్విస్టులతో స్టోరీ చెప్పేస్తే.. ఆడియన్స్ ఎంటర్‌టైన్ అవుతారా? క్లైమాక్స్ ఒకటి బాగుంటే.. సినిమా హిట్ అవుతుందా? లాజిక్కుల గురించి ఇక్కడ ప్రస్తావించకపోవడమే మంచింది. ఇంటర్వెల్ సీన్ మినహా ఫస్టాఫ్ మొత్తం బోరింగే అని చెప్పాలి. కొన్ని సీన్లను ఎందుకు పెట్టారో కూడా అర్థమే కాదు. ఏదో సంబంధం ఉన్నట్లుగా సెకండాఫ్‌లో జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ..అక్కడ కూడా లాజిక్ మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. ఉన్నంతతో ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్ మొత్తం మర్డర్ మిస్టరీ చుట్టూనే కథనం సాగుతుంది. స్క్రీన్‌ప్లే గందరగోళంగానే ఉంటుంది తప్ప..ఎక్కడ ఆకట్టుకోలేదు. క్లైమాక్స్‌లో ఓ పాత్ర ఇచ్చే ట్విస్టు బాగుంటుంది. అయితే అప్పటికే ప్రేక్షకుడి సహనం నశించిపోవడంతో.. అది కూడా అంత థ్రిల్లింగ్‌గా అనిపించదు.
నటీనటుల విషయానికొస్తే.. అల్లరి నరేశ్ ఉన్నంతలో బాగానే చేశాడు కానీ కథలో దమ్ములేనప్పుడు ఎంత మంచి నటుడైనా ఏం చేయగలడు? ఆయన పాత్రను తీర్చిదిద్దిన విధానమే బాగోలేదు. ఇక తెలంగాణ యాసలో మాట్లాడేందుకు బాగానే ప్రయత్నించాడు కానీ.. న్యాచులారిటీ మిస్ అయింది. కామాక్షి భాస్కర్ల పాత్ర చుట్టూనే ఈ కథ నడుస్తుంది కానీ..ఆమెకు నటించే స్కోప్ అయితే లేదు. అభిరామి తెరపై కనిపించేది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకుంది. సినిమా మొత్తంలో ఆమె నటన ఒక్కటే బాగా గుర్తుంటుంది. అనీష్, సాయికుమార్, హర్ష, గెటప్ శ్రీనుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధిమేర చక్కగా నటించారు.
సాకేంతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్ సిసిరోలియో బీజీఎం జస్ట్ ఓకే. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణవిలువలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.


