ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం జాలీ ఎల్‌ఎల్‌బి 3 ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
పక్కవాడు బాగుంటే ఆనందపడేవాళ్ళు కొందరైతే... మనవాళ్ళైనా సరే బాగుపడుతుంటే చూసి ఈర్ష్య పడేవాళ్ళు మరికొందరు. ఆ మరికొందరిపై అల్లుకున్న కథే ఈ ‘జాలీ ఎల్‌ఎల్‌బి 3’ సినిమా. వాదన ప్రతివాదన అనేది నిత్యం ఎక్కువగా జరిగేది న్యాయవాదుల మధ్యనే కదా. అంటే... న్యాయస్థానాలు దాదాపుగా గంభీర వాతావరణంలో ఉంటాయి. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ ‘జాలీ ఎల్‌ఎల్‌బి 3’ సినిమా చూస్తే మాత్రం మీకు కితకితలు ఖాయం
. ‘జాలీ ఎల్‌ఎల్‌బి’ సిరీస్‌లో వచ్చిన మూడవ భాగమిది. మొదటి భాగం నుండి ఇప్పటివరకు ప్రతి సిరీస్‌లో కనిపించిన నటుడు అర్షద్ వార్సీ, ఇతని కాంబినేషన్‌లో అక్షయ కుమార్ నటించిన ఈ చిత్రానికి సిరీస్‌లో అన్ని చిత్రాలను తెరకెక్కించిన సుభాష్ కపూరే దర్శకత్వం వహించారు.
నిజజీవిత ఆధారిత ఘటనల చుట్టూ కథలను అల్లుకొని రూపొందించిన ఈ ప్రతి సిరీస్‌లోని హ్యూమర్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను అలరిస్తుంది. ఈసారి కూడా అలాంటి ప్రయత్నమే చేసి, ప్రేక్షకుల దగ్గర మార్కులు కొట్టేశారు ఈ జాలీ ఎల్‌ఎల్‌బి. ఇక ఈ సినిమా కథాంశానికొస్తే... దేశాన్ని కుదిపేసిన రైతుల ఉద్యమం చుట్టూ ఈ కథ నడుస్తుంది.
రాజస్థాన్ రాష్ట్రంలోని రాజారాం సోలంకి అనే రైతుకి సంబంధించిన ఓ పొలం వివాదం పై కోర్టులో జానకి అనే ఆవిడ కేసు వేసి ఉంటుంది. బికనీర్ టు బోస్టన్ ప్రాజెక్టు కోసం పరసూల్ ప్రాంతంలో ఉన్న పొలాలన్నిటినీ కేతన్ అనే వ్యాపారవేత్త అక్రమంగా లాక్కుంటాడు. జానకితో పాటు చాలా మంది రైతులు ఇదే వివాదంపై కోర్టు మెట్లెక్కుతారు.
ఢిల్లీ సెషన్స్ కోర్టు ప్రాంగణంలో మీరట్‌కు చెందిన జగదీష్ త్యాగి, కాన్పూర్‌కి చెందిన జగదీష్ మిశ్రా ‘లా’ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇద్దరి పేర్లు దాదాపుగా ఒకటవడం వల్ల ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. ఇదే నేపథ్యంలో జానకి తన పిటిషన్‌తో వీళ్ళిద్దరి మధ్యకు చేరుతుంది. ఒకరంటే ఒకరికి పడని ఇద్దరు లాయర్లతో అవతల కోట్లకు పడగెత్తిన ప్రముఖ వ్యాపారవేత్తపై తాను చేస్తున్న ఈ న్యాయ పోరాటంలో జానకి గెలుస్తుందా? లేదా అన్నది ‘జాలీ ఎల్‌ఎల్‌బి 3’ సినిమాలోనే చూడాలి.
చాలా సీరియస్ సబ్జెక్ట్ అయినా సరదా సరదాగా సాగిపోతుందీ సినిమా. ఓ పక్క మెయిన్ పాయింట్ నుండి పక్కకు వెళ్ళకుండా... అలా అని ప్రేక్షకుడిని మరీ సీరియస్ మోడ్‌లోకి తీసుకెళ్ళకుండా చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుందీ సినిమా. మస్ట్ వాచ్.
– హరికృష్ణ ఇంటూరు


