
టాలీవుడ్ నటి కల్పికా గణేశ్ పేరు కొద్దిరోజులుగా సోషల్మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా తనపై తండ్రే ఫిర్యాదు చేశారు. రెండు నెలల క్రితం ప్రిజం పబ్ యాజమాన్యం ఆమెపై కేసు పెట్టింది. బిల్ చెల్లించకుండా తమ సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని కల్పికపై ఫిర్యాదు చేశారు. అయితే, అదంతా అబద్దం అంటూ ఆమె వివరణ ఇచ్చింది. రీసెంట్గా హైదరాబాద్ నగర శివారులోని ఓ రిసార్ట్కు వెళ్లిన కల్పిక అక్కడ కూడా గొడవ చేసింది. సిగరెట్ అడిగితే పట్టించుకోలేదని అతనిపై ఫైర్ అయింది. ఆ వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది. దీంతో ఆమె మళ్లీ వివరణ ఇచ్చింది. ప్రశాంతత కోసం రిసార్ట్కు వెళ్లినా తనకు ఎలాంటి ప్రశాంతత దక్కలేదని చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్లు కూడా ఆమెపై మండిపడ్డారు. మంచి డాక్టర్ను చూసి మానసిక వైద్యం కోసం ట్రీట్మెంట్ తీసుకోవాలని సలహా ఇచ్చారు. అయితే, తాజాగా కల్పిక గణేష్ తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
కల్పిక కొంత కాలంగా మానసిక సమస్యతో ఇబ్బంది పడుతుందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఆమె రెండుసార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నం చేసిందన్నారు. దీంతో ఆమెను గతంలోనే రిహాబిలిటేషన్ సెంటర్‌లో చేర్పించామన్నారు. అయితే, అక్కడ ఉండకుండా ఆమె తిరిగి వచ్చిందని చెప్పారు. వైద్యులు సూచించిన మెడిషన్స్ కూడా రెండేళ్ల క్రితమే ఆపేసిందన్నారు. దీంతో తరచూ ఇంట్లో గొడవలు పడుతుందన్నారు. దయచేసి ఆమెను మళ్లీ రిహాబిలిటేషన్కు తరలించాలని పోలీసులను ఆయన కోరారు.
'ఆరెంజ్' మూవీలో జెనీలియా ఫ్రెండ్‌గా నటించిన కల్పిక గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత తెలుగులో జులాయి, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడిపడి లేచే మనసు, హిట్ ఫస్ట్ కేసు, యశోద తదితర చిత్రాలు చేసింది.