‘‘రోమాంచకం’ చిత్రంలో ప్రేమ, హాస్యం, ఉత్కంఠ... ఈ మూడు భావోద్వేగాలు బలంగా ఉంటాయి. ఈ మూడింటిలో నాకు ఉత్కంఠ బాగా నచ్చింది. ఈ ఉత్కంఠ కూడా ప్రేమవల్లే అవుతుంది. అది ఎలా జరిగింది? అనేది సినిమాలోనే చూడాలి. నేను గతంలో చేసిన పాత్రలకు భిన్నంగా ‘రోమాంచకం’లో నా క్యారెక్టర్ ఉంటుంది. ఈ సినిమాని మేము ఎంత సరదాగా, సంతోషంగా చేశామో సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా అలాగే ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను’’ అని హీరోయిన్ అనంతిక సనిల్‌కుమార్ తెలిపారు.
సుమంత్ ప్రభాస్, అనంతిక జోడీగా నటించిన చిత్రం ‘రోమాంచకం’. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అనంతిక సనిల్‌కుమార్ మాట్లాడుతూ–‘‘8 వసంతాలు’ సినిమా తర్వాత చాలా కథలు విన్నప్పటికీ ఎగై్జటింగ్‌గా అనిపించలేదు. ‘రోమాంచకం’ కథ విన్నాక చాలా సంతోషంగా అనిపించింది. ఈ సినిమాలో బబ్లీ గర్ల్, సరదాగా ఉండే తమిళ అమ్మాయిగా కనిపిస్తా.
ఇది ప్రేమ కథా చిత్రమే అయినప్పటికీ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. సుమంత్ ప్రభాస్ పాత్ర ఈ మూవీలో చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. నా క్యారెక్టర్ కూడా ఆయనతో పోటీ పడేలా తీర్చిదిద్దారు డైరెక్టర్ వేణుగోపాల్‌గారు. సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డిగార్లు నా పాత్ర చాలా బాగా వచ్చిందని అభినందించడం సంతోషం. అయితే ప్రేక్షకుల స్పందన కోసం వేచి చూస్తున్నాను. యాక్షన్, డ్యాన్స్ బేస్డ్ సినిమాలు వచ్చినా చేయడానికి సిద్ధమే. ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్నా. తెలుగులో చర్చలు జరుగుతున్నాయి’’ అని పేర్కొన్నారు.


