Super Star Krsihna: ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్‌ స్టార్‌

Actor Superstar Krishna 4 Unfulfilled Dreams Goes Viral On Social Media - Sakshi

సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతితో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన అకాల మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. వెండితెరపై 350 వందలకు పైగా చిత్రాలు చేసి వైవిధ్య పాత్రలతో అలరించిన ఆయన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు.  హీరోగా వందల సినిమాలు చేసిన ఘనత ఒక్క ఆయనకే దక్కింది. హీరో, నిర్మాత, దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో హిట్స్‌ అందించి చరిత్ర సృష్టించారాయన. అయితే తన జీవితంలో ఎన్నో విజయాలను, రికార్డులను సొంతం చేసుకున్న కృష్ణ చివరికి ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూశారు. అవేంటంటే.. 

మనవడితో కలిసి తెరపై సందడి చేయాలనుకున్నారు…
‘వన్ నేనొక్కడినే’ మూవీతో ఆయన మనవడు, మహేశ్‌ కుమారుడు గౌతమ్ కృష్ణ వెండితెరకు పరిచయం అయ్యాడు. దాంతో మనవడితో నటించాలని ఉందని ఈ మూవీ ప్రమోషన్స్‌ సమయంలో, మూవీ విడుదల తర్వాత  కూడా పలు సందర్భాల్లో వెల్లడించారు. కానీ అది కుదరలేదు. మంచి కథ వస్తే మహేశ్‌తో కలిసి మరో సినిమాలో నటించాలనుకున్నారు. కానీ ఆ కోరిక కూడా తీరలేదు. అయితే కృష్ణ తన కుమారులు మహేశ్‌​, రమేశ్‌ బాబులతో కలిసి చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. తండ్రి నటించిన పలు చిత్రాల్లో మహేశ్‌ బాలనటుడిగా కనిపించారు.

ఆయనను జేమ్స్‌ బాండ్‌గా చూడాలనుకున్నారు..
తెలుగు తెరకు జెమ్స్‌బాండ్‌ తరహా పాత్రని పరిచయం చేసింది కృష్ణే. గూఢఛారి 116, రహస్య గూఢచారి వంటి చిత్రాల్లో నటించి టాలీవుడ్‌ జేమ్స్ బాండ్‌గా గుర్తింపు పొందారు. తనలానే కుమారుడు మహేశ్‌ను కూడా జేమ్స్‌ బాండ్‌ పాత్రలో చూడాలనుకున్నారాయన. ఇదే విషయాన్ని పలు ఇంటర్య్వూలో ఆయన పేర్కొన్నారు. మహేశ్‌ను ఎలాంటి పాత్రలో చూడాలనుకుంటున్నారంటూ జెమ్స్‌బాండ్‌గా అని ఆయన సమాధానం ఇచ్చారు.

దాంతో మహేశ్‌ను జేమ్స్‌బాండ్‌గా చూడాలనే కృష్ణ కోరిక తీరకుండానే మిగిలిపోయింది. కాగా మహేశ్‌-రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రంలో మహేశ్‌ జేమ్స్‌బాండ్‌ తరహా పాత్రలో చేయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అదే నిజమైతే కృష్ణ కోరిక తీరినట్టే.. కానీ తెరపై మహేశ్‌ను జెమ్స్‌బాండ్‌గా చూసి మురిసిపోవాలనుకున్న ఆయన ఆశ మాత్రం అలాగే ఉండిపోతుంది. 

ఆయన మనసు పడ్డ పాత్రలో నటించకుండానే..
తెరపై విభిన్న పాత్రలతో ప్రయోగాలు చేసిన కృష్ణకు చత్రపది శివాజీగా చేయాలనేది ఆయన కోరిక. అల్లూరి సీతారామరాజుగా వెండితెరపై చెరగని ముద్ర వేసుకున్న ఆయన ఆ తర్వాత మనసు పడ్డ మరో పాత్ర.. ఛత్రపతి వీర శివాజీ. చంద్రహాస సినిమాలో కృష్ణ శివాజీ పాత్రలో నటించారు. అయితే.. అది పూర్తిస్థాయి పాత్ర కాదు. కాసేపు మాత్రమే. దానికి తృప్తి చెందని కృష్ణ పూర్తి స్థాయిలో చత్రపతి శివాజీ సినిమా చేయాలనుకున్నారట.  

‘అల్లూరి సీతారామరాజు’ తర్వాత మహారథితో శివాజీ స్క్రిప్ట్‌ రెడీ చేయమని చెప్పారట కృష్ణ. ఆ ప్రాజెక్ట్‌ మీద కొంత వర్క్‌ కూడా చేశారు. అయితే.. ఆ సినిమా వలన మత ఘర్షణలు చెలరెగే అవకాశం ఉందనే సందేహం వచ్చింది. దీంతో ఈ సినిమా చేయాలనే ఆలోచనను ఆయన వెనక్కి తీసుకున్నారట. దాంతో తనకు ఇష్టమైన శివాజీ పాత్రలో కనిపించాలనే కోరిక తీరకుండానే పోయింది. ఆ తర్వాత ఆ అవకాశం కూడా ఆయనకు రాలేదు.

ఓ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా చేయాలని..
బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహస్తున్న రియాలిటీ షో  ‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’. దేశవ్యాప్తంగా ఈ షో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. తెలుగులోనూ ఈ షో నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది.  అయితే అప్పట్లోనే ఇలాంటి ఓ రియాలిటీ షో చేయాలన్నది కృష్ణ కోరిక అట. కౌన్‌ బనేగా కరోడ్‌ పతి చూసి ఇక్కడ కూడా అలాంటి ఓ షో చేయాలని ఆయన కోరుకున్నారట. అమితాబ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించే కేబీసీ షో చూసిన కృష్ణ.. తనకు కూడా అటువంటి షో చేయాలని ఉందని ఓ సందర్భంలో తన మనసులో మాట బయటపెట్టారు. అటువంటి కొత్త కాన్సెప్ట్‌తో ఎవరైనా టీవీ షో ఆఫర్‌తో తన దగ్గరకు వస్తే చేస్తానన్నారు. బుల్లితెరపై షోలు చేయడానికి తనకు అభ్యంతరం లేదని కృష్ణ గతంలో తెలిపారు. 

చదవండి
రికార్డుల గని... అందుకే ఆయనను నిర్మాతల హీరో అన్నారు
తండ్రి మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమైన మహేశ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top