
గత వారం రోజులుగా టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ వార్తల్లో ఉంటూ వచ్చాడు. మహాత్మ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసిన ఇతడు.. తీవ్రస్థాయిలో రెచ్చిపోయాడు. గాంధీ మహాత్ముడేమీ కాదని, భారత దేశానికి సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి వారి వల్లే స్వాతంత్ర్యం వచ్చిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీని తర్వాత మరో వీడియోలో వర్ణించడానికి వీల్లేని విధంగా కామెంట్స్ చేశాడు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9లో అందరూ ఓవర్ యాక్షన్.. నేనేంటో చూపిస్తా: మాధురి)
అయితే శ్రీకాంత్ అయ్యంగర్ చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. అలానే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఇతడు నటించిన 'అరి' సినిమా ప్రదర్శనని అడ్డుకున్నారు. థియేటర్ బయట శ్రీకాంత్ దిష్టిబొమ్మని కూడా పలువురు వ్యక్తులు దహనం చేశారు. ఆదివారం.. మా అధ్యక్షుడు మంచు విష్ణుని కలిసిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.. శ్రీకాంత్ తీరు గురించి ఫిర్యాదు చేశారు.
దీంతో ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగర్ క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు ఇన్ స్టాలో ఓ వీడియో రిలీజ్ చేశాడు. అయితే గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు తెలుగులో నోటికొచ్చినట్లు మాట్లాడిన ఇతడు.. ఇప్పుడేమో ఇంగ్లీష్‌లో క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడే కాదు గతంలోనూ ఇలానే మూవీ రివ్యూయర్‌లపై దారుణమైన కామెంట్స్ చేశాడు. నటుడిగా ఇతడు బాగా చేస్తుండొచ్చు గానీ అప్పుడప్పుడు ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే)