
‘‘తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పే చిత్రం ‘షష్టిపూర్తి’. ఈ సినిమా చేస్తున్న సమయంలో మా నాన్న గుర్తొచ్చారు. ఆయన్ని నేను చాలా మిస్ అయ్యాను. కుటుంబ సమేతంగా అందరూ కలిసి చూడాల్సిన చిత్రమిది. తల్లిదండ్రులను ప్రేమించండి... వారితో ఎక్కువ సమయాన్ని గడపండి’’ అని హీరోయిన్ ఆకాంక్షా సింగ్ తెలిపారు. రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో, రూపేష్, ఆకాంక్షా సింగ్ జంటగా నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వంలో హీరో రూపేష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఆకాంక్షా సింగ్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘షష్టిపూర్తి’లో జానకి అనే గ్రామీణ అమ్మాయి పాత్ర చేశాను. అచ్చమైన తెలుగమ్మాయిలా లంగా ఓణిలో స్క్రీన్‌పై కనిపించడం నాకిదే తొలిసారి. ఇక ‘బెంచ్ లైఫ్’ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌గారితో నటించాను. ఇప్పుడు ‘షష్టిపూర్తి’లో చేశాను. మేమిద్దరం ఎప్పుడు కలిసి నటించినా భావోద్వేగ సన్నివేశాల కోసం గ్లిజరిన్ వాడలేదు. సహజంగానే నటించేస్తాం. కథ, పాత్ర నచ్చితే వెబ్ సిరీస్‌లో అయినా నటిస్తాను. యాక్షన్ చిత్రాలంటే ఎక్కువగా ఇష్టం. ప్రస్తుతం తెలుగులో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాను. తమిళంలో ఒక సినిమా ఒప్పుకున్నాను’’ అని తెలిపారు.