ఆగిన వైద్య సేవలు | - | Sakshi
Sakshi News home page

ఆగిన వైద్య సేవలు

Nov 2 2026 9:18 AM | Updated on Nov 2 2026 9:18 AM

21 రోజులుగా విధులకు దూరంగా

జిల్లావ్యాప్తంగా నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం)లో 412 మంది ఉద్యోగులున్నారు. వీరంతా 12 రకాల కేడర్లలో వివిధ రకాల విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో డాక్టర్లు, ఏఎన్‌ఎంలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ల్యాప్‌ టెక్నీషియన్లు, సైకాలజిస్టులు, రేడియాలజిస్టులు, ఆర్‌బీఎస్‌కె సిబ్బందితోపాటు ఆయుష్‌ సిబ్బంది సైతం ఉన్నారు.

మాయదారి జీవో నం 1295

నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) విధానంలో విధులు నిర్వహించే సిబ్బందికి 60% వేతనాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా, మిగతా 40% వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. కాగా గత కొంతకాలం క్రితం తీసుకొచ్చిన 1295 జీవో ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది జీవితాలను తలక్రిందులు చేసింది. ఈ జీవోలో కొంతమంది ఉద్యోగులను చేర్చి కొందరికి వేతనాలు పెంచితే, మరికొంతమందికి వేతనాలు తగ్గించారు. అంతేకాకుండా గత 2 ఏళ్లక్రితం జీతాలు పెరిగినా వాటిని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలేదని పలువురు ఆవేదన చెందుతున్నారు. అంతేకాకుండా ప్రతీ ఏటా కేంద్ర ప్రభుత్వం 5% ఇంక్రిమెంట్‌ ఇస్తూ బడ్జెట్‌ విడుదల చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా మా పొట్టకొడుతుందని పలువురు పేర్కొంటున్నారు. అంతే కాకుండా ప్రతీ నాలుగేళ్లకోసారి 13% లాయల్టీ బోనస్‌ కేంద్రం నుంచి వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం లేదంటూ ఆవేదన చెందుతున్నారు.

నిలిచిన విధులు...!

తమ డిమాండ్లు పరిష్కరించే వరకు విధుల్లో చేరబోమంటూ ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది గత 21 రోజులుగా రిలే నిరాహారదీక్ష చేస్తున్నారు. దీంతో వైద్యారోగ్యశాఖలోని సుమారు 12 కేడర్లలో పూర్తిస్థాయిలో సేవలు నిలిచిపోయాయి. డీఎంహెచ్‌ఓ కార్యాలయం మొదలుకుని క్షేత్రస్థాయిలో నిర్వహించే వైద్యసేవల వరకు పూర్తిగా నిలిచిపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఆబ్సెంట్‌ లిస్టు అడిగిన ప్రభుత్వం

ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది డిమాండ్ల పరిష్కారం కోసం గత 21 రోజులుగా దీక్షలు చేస్తున్న నేపథ్యంలో వారి డిమాండ్ల పరిష్కారం కోసం కృషి చేయాల్సిన ప్రభుత్వం, విధులకు హాజరుకానీ సిబ్బంది జాబితాను ఇవ్వాలని సంబంధిత ఉన్నతాధికారులను అడిగినట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వ తీరుపై ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు మండిపడుతున్నారు.

8 రాష్ట్రాలల్లో క్రమబద్దీకరణ

ఎన్‌హెచ్‌ఎం సిబ్బందిని 2005 నుంచి దేశంలోని అనేక రాష్ట్రాల్లో పలువిడతలుగా ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు పద్ధతిన విధుల్లోకి తీసుకున్నారు. కాగా, ఇప్పటివరకు 8 రాష్ట్రాల్లో వారిని రెగ్యులరైజ్‌ చేశారు. మన రాష్ట్రంలోనూ వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలి.

డాక్టర్‌ ప్రియాంక, ఎన్‌హెచ్‌ఎం జేఏసీ అధ్యక్షురాలు

జిల్లావ్యాప్తంగా 412 మంది ఎన్‌హెచ్‌ఎం పరిధిలో విధులు నిర్వహిస్తుండగా వారిలో కొందరు 20 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి వారి జీవితంలో సగానికిపైగా ఈ ఉద్యోగ సర్వీస్‌ ఇందులోనే గడిచింది. విధుల్లో చేరిన మొదట్లో 5 నుంచి 6 ఏళ్ల అనంతరం ఉద్యోగ భద్రత (రెగ్యులరైజ్‌) చేస్తామంటూ అప్పట్లో చెప్పారని పలువురు బాధిత సిబ్బంది వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. మహిళా ఉద్యోగులకు కల్పించే (ప్రసూతి) సెలవు దినాల్లో 3 నెలలపాటు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబానికి రూ.20 లక్షల బీమాతోపాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి. ప్రతీ నెల 5వ తేదీలోగా వేతనాలు చెల్లించాలనే డిమాండ్లతో ఽవిధులు బహిష్కరించి రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.

సిబ్బంది సమ్మె బాట

21 రోజులుగా ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది ఆందోళన

రెండు దశాబ్దాలుగా ఔట్‌సోర్సింగ్‌లోనే విధులు

డిమాండ్లు నెరవేర్చే వరకు విధుల్లో చేరేదిలేదంటున్న సిబ్బంది

జిల్లాలో వైద్య సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. రెండు దశాబ్దాలుగా నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) వైద్య ఆరోగ్యశాఖలో విధులు నిర్వహిస్తున్న వందలాది మంది సిబ్బంది తమకు ఉద్యోగ భద్రతతో పాటూ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ 21 రోజులుగా విధులు బహిష్కరించి పోరుబాట పట్టారు. దీంతో వైద్యారోగ్యశాఖలో విధులు నిలిచి పోయాయి. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు తాము విధుల్లో చేరేదిలేదంటూ కరాఖండిగా తేల్చి చెబుతున్నారు. మెదక్‌జోన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement