సమావేశాల భోజనాలకు వెచ్చింపు ఒక్కో కాంప్లెక్స్ స్కూల్‌కు రూ.43 వేలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 194 స్కూల్ కాంప్లెక్స్‌లు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడం.. ఉపాధ్యాయులకు మార్గదర్శనం చేయడం.. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడం.. బోధన నూతన పద్ధతులను ప్రోత్సహించడం.. ఇవీ పాఠశాల కాంప్లెక్స్‌ల ప్రధాన లక్ష్యాలు. ఇందుకోసం విద్యాశాఖ ఏటా నిధులు కేటాయిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో ఆ నిధుల వినియోగం కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయుల సమావేశాల భోజనాలకే ఎక్కువగా వినియోగిస్తుండటం గమనార్హం. కాంప్లెక్స్ సమావేశం రోజు మధ్యాహ్న భోజనంలోనే ఉపాధ్యాయుల సంఖ్యను కలిపి భోజనం అందిస్తే విద్యార్థుల విద్యాభివృద్ధి లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది.
– సాక్షి, సిద్దిపేట
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ రంగ పాఠశాలలు 2,797 ఉండగా 3,15,112 విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 194 కాంప్లెక్స్ స్కూళ్లు ఉన్నాయి. ఒక్కో కాంప్లెక్స్ స్కూల్‌కు ప్రభుత్వం రూ.43వేలను మంజూరు చేస్తోంది. ఇందులో కాంటిజెన్సీ ఫండ్ కింద రికార్డులు, స్టేషనరీ రూ.3,200, కాంప్లెక్స్ హెచ్‌ఎం ఫోన్ బిల్ రూ.3,600, కాంప్లెక్స్ సమావేశంలో టీ, స్నాక్స్‌కు నెలకు రూ.400 చొప్పున 8 నెలలకు రూ. 3,200, క్లస్టర్ స్థాయి పోటీలకు రూ.3వేలు, నిర్వహణ కోసం రూ.20వేలు ఖర్చు చేయాలి. కాంప్లెక్స్ స్థాయిలో 8 నెలల పాటు నెలకు రెండు నుంచి మూడు సమావేశాలు నిర్వహించాలి.
ప్రతీ నెలలో రెండు నుంచి
మూడు సమావేశాలు
ప్రతి నెలలో రెండు నుంచి మూడు కాంప్లెక్స్ సమావేశాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగుతాయి.. ప్రభుత్వ పాఠశాలలలో ఉపాధ్యాయులకు సైతం మధ్యాహ్న భోజనం చేయాలని విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఎక్కువ మంది ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం పాఠశాలలోనే చేస్తున్నారు. లంచ్ బాక్స్‌ను తెచ్చుకోవడం బంద్ చేశారు. మూడు నెలలుగా ఈ సమావేశాలకు వచ్చే ఉపాధ్యాయులకు కాంపెక్స్ ప్రధానోపాధ్యాయుడే భోజనం ఏర్పాటు చేయాల్సి వస్తుంది. సమావేశానికి ప్రభుత్వం టీ, స్నాక్స్ కోసం రూ.400 మాత్రమే కేటాయించింది. దీనితో మిగతా కార్యక్రమాలకు కోత విధిస్తూ ఉపాధ్యాయుల భోజనం కోసం నిధులు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు నుంచి మూడు సమావేశాలకు భోజనాల కోసం దాదాపు రూ.15వేలు ఖర్చు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంప్లెక్స్ సమావేశం జరిగినే పాఠశాలలో సమావేశానికి వచ్చిన ఉపాధ్యాయుల సంఖ్యను కలిపి వారికి సైతం మధ్యాహ్న భోజనం అందిస్తే నిధులు భోజనాల కోసం ఖర్చు చేయకుండా విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం వినియోగించే అవకాశం ఉంటుంది. దీని పై విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాలని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు.
విద్యార్థుల కార్యక్రమాలకు కోత
నిబంధనల ప్రకారమే వినియోగించాలి
స్కూల్ కాంప్లెక్స్‌లకు కేటాయించే నిధులు నిబంధనల ప్రకారమే వినియోగించాలి. విద్యార్థుల కోసం వినియోగించకుండా ఇతర వాటికి వినియోగించవద్దు. విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం సూచనలు సలహాల కోసం కాంప్లెక్స్ సమావేశాలు ఉపయోగపడనున్నాయి.
– రమేశ్, ఇన్‌చార్జీ డీఈఓ, సిద్దిపేట


