కౌడిపల్లి(నర్సాపూర్): భక్తులతో తునికి శ్రీ నల్లపోచమ్మదేవి ఆలయం కిటకిటలాడింది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. దేవదాయశాఖ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌స్పెక్టర్, ఆలయ ఈఓ రంగారావ్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శివ్వప్ప, రాజేశ్ నల్లపోచమ్మదేవికి పంచామృతాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించి ఒడిబియ్యం కుంకుమార్చన ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద శివసత్తులు పూనకాలు బోనాల ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. పలువురు భక్తులు అమ్మవారికి తలనీలాలు సమర్పించి వాహనాలు పూజలు చేయించారు. ఆలయ జూనియర్ అసిస్టెంట్ వెంకట్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.


