ిసద్దిపేటకమాన్: వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చిన ఖైదీ పరారైన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. జిల్లా జైలులో ఉన్న పలు కేసుల్లోని ఏడుగురు ఖైదీలను ఏఆర్ ఎస్‌ఐ ఒడ్డన్న తొమ్మిది మంది సిబ్బందితో కలిసి సాధారణ వైద్య పరీక్షల కోసం పట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసు వ్యానులో తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం నలుగురు ఖైదీలను ఆస్పత్రి బయట ఉన్న పోలీసు వ్యానులో ఎక్కించారు. ఇక్కడ పోలీసులు ఎస్కార్ట్‌గా ఉన్నారు. మరో ముగ్గురు ఖైదీలకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వ్యానులో ఉన్న ఖైదీల్లో పలు వాహనాల చోరీ కేసుల్లో అరైస్టె జైలులో ఉన్న జొన్నల సాయికుమార్(26) అనే ఖైదీ తన చేతికి ఉన్న హ్యాండ్ కప్స్, లీడింగ్ చైన్‌ను తొలగించుకుని వ్యాను అత్యవసర ద్వారం నుంచి దూకి పారిపోయాడు. స్థానికులు గుర్తించి కేకలు వేయడంతో అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఆచూకీ లభించలేదు. పారిపోయిన నిందితుడు వాహనాల చోరీ కేసులో నిందితుడుగా గుర్తించి ఈ నెల 15న చిన్నకోడూరు పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. కాగా ప్రభుత్వాసుపత్రి వద్దకు సిద్దిపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి చేరుకుని ఆరా తీశారు. ఘటనపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలో మొట్టమొదటి సారి ఖైదీ పరారు కావడం చర్చనీయాంశమైంది.


