రామాయంపేట(మెదక్): చిన్నపాటి వర్షానికే రామాయంపేట మున్సిపాలిటీ అస్తవ్యస్తమవుతోంది. సోమవారం రాత్రి కురిసిన భారీ వానకు సిద్దిపేట రోడ్డు ప్రధాన రహదారిపై, అక్కలబస్తీలో రోడ్డుపై నీరు నిలిచి కాలనీవాసులు అవస్థలు పడ్డారు. అధికారులు తమ గురించి ఎంతమాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంఘటనలతో పాఠం నేర్చుకోని మున్సిపల్ అధికారులు గుంతల్లో నామమాత్రంగా కంకరపోయించారు. భారీ వర్షంతో కంకర మొత్తం కొట్టుకుపోయి రోడ్డుపై పెద్ద గుంతలు తేలాయి. దీంతో గంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగి వాహనదారులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు.


