అదనపు కలెక్టర్ నగేశ్
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలను పరిశీలించి వెంట వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో జిల్లా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భూ భారతి 37, పెన్షన్లు 4, ఇందిరమ్మ ఇళ్ల కోసం 7, ఇతర 34 కలిపి మొత్తం 82 వినతులు వచ్చాయి. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. దరఖాస్తులను తక్షణమే పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆయాశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్‌పై
అప్రమత్తంగా ఉండాలి
పాపన్నపేట(మెదక్): ఎస్‌ఐఆర్‌కు సమయం దగ్గర పడుతుండటంతో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్‌ఎస్ ఎస్‌ఐఆర్ జిల్లా సమన్వయకర్త శశిధర్‌రెడ్డి పిలునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో అర్హులైన ఓటర్లు 100 శాతం నమోదు చేసుకునేలా చర్య లు తీసుకోవాలని సూచించారు. అనునిత్యం బీఎల్‌ఓలతో మాట్లాడుతూ.. నమోదు కాని ఓటర్లు ఎవరైనా ఉంటే, వారి ఇంటికి వెళ్లి నమోదు చేయించాలన్నారు. ఆగస్టు 3తో గడు వు ముగుస్తుందని, 2002 ఓటర్ లిస్టు అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు. సమావేశంలో మాజీ సర్పంచ్ గురుమూర్తిగౌడ్, మల్లన్న, డాక్టర్ రమేష్, శ్రీనివాస్, ఉస్మాన్, వెంకటేశం, భూమాగౌడ్, పంతుల కిషన్, నిజాం, మహేందర్, రవీందర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
రైతుల కోసమే
విత్తన మేళా
నర్సాపూర్: వర్షాలు తక్కువగా కురుస్తున్నందున వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ ఏడీ సంధ్యారాణి రైతులను కోరారు. సోమవారం స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆరుతడి పంటలలో ప్రస్తుత వాతావరణానికి మొక్కజొన్న, జొన్న, కందులు, పెసర్లు, పశుగ్రాసం తదితర పంటలు సాగు చేయాలని సూచించారు. విత్తనాలు ఒకే చోట అందుబాటులో ఉంచడానికే విత్తన మేళా కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్, మండల వ్యవసాయాధికారి దీపిక, ఏఈఓలు మోహన్, తేజస్విని, రాజశేకర్, లావణ్య, దుర్గాప్రసాద్ పలువురు విత్తన డీలర్లు పాల్గొన్నారు.
29, 30న అంగన్ వాడీ దరఖాస్తుల పరిశీలన
మెదక్ కలెక్టరేట్/నర్సాపూర్: ఈనెల 29, 30 తేదీల్లో అంగన్‌వాడీ దరఖాస్తుల పరిశీలన ఉంటుందని మెదక్ సీడీపీఓ వెంకటరమణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 29న కౌడిపల్లి, పాపన్నపేట మండలాల్లోని టీచర్ పోస్టు అభ్యర్థులకు, 30న హెల్ప్‌ర్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. అభ్యర్థులంతా ఒరిజినల్ పత్రాలతో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెదక్ ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు. అలాగే 29న నర్సాపూర్, శివ్వంపేట, చిలప్‌చెడ్ మండలాలకు చెందిన అభ్యర్థుల సర్టిఫికెట్లు, 30న తూప్రాన్, మనోహరాబాద్, కౌడిపల్లి మండలాలకు చెందిన అభ్యర్థుల పరిశీలన ఉంటుందని సీడీపీఓ సీడీపీఓ హేమాభార్గవి తెలిపారు.


