మెదక్ కలెక్టరేట్: మత్తు పదార్థాల రవాణాను నివారించి సమాజాన్ని కాపాడుదామని కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేశ్‌తో కలిసి మత్తు పదార్థాల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో యాంటీ డ్రగ్, రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే పాఠశాలల వద్ద వంద మీటర్ల లోపు పాన్‌షాప్‌లలో గుట్కా లాంటి అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్, రెవెన్యూ, వైద్యశాఖల అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహంచి, మత్తు పదార్థాలు, పొగాకు విక్రయాలను నిరోధించాలన్నారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో మత్తు పదార్థాల నివారణకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు రోడ్డు భద్రతపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మెదక్‌ను జీరో యాక్సిడెంట్ జోన్‌గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అలాగే జిల్లాలో పర్యాటక అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు.
సర్‌కు సహకరించండి
వెల్దుర్తి(తూప్రాన్): వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న సమగ్ర ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్‌పర్సన్, ఎస్‌ఐఆర్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెన్నెల పరిశీలించారు. ఈసందర్భంగా సర్వే నిర్వహిస్తున్న బీఎల్‌ఓలతో మాట్లాడి ప్రక్రియ పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అర్హులు ఓటరు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే ఓటరు జాబితాలో పేర్లు ఉన్నవారు తమ వివరాలను మరోసారి పరిశీలించుకోవాలన్నారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించి సరైన వివరాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నేడు మూడు
జిల్లాల కలెక్టర్లతో సమీక్ష
హుస్నాబాద్: ఎల్‌నినో ప్రభావం ఎదుర్కొనేందుకు ఆయా శాఖల అధికారులతో నిర్వహించనున్న సన్నాహక సమావేశానికి మూడు జిల్లాల కలెక్టర్లు హాజరు కానున్నట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల వివిధ శాఖల అధికారులతో నిర్వహించే సమీక్ష ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ... వివిధ శాఖల అధికారుల యాక్షన్ ప్లాన్ తెలపడం కోసం ప్రొజెక్టర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినుల వసతి కోసం కేటాయించిన రైతు బజార్‌ను పరిశీలించారు. ఆర్డీఓ రామ్మూర్తి, కళాశాల అద్యాపకులు పాల్గొన్నారు.


