జిల్లాలోని పలు దర్శనీయ స్థలాలకు రూ.3 కోట్లు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలోని పలు దర్శనీయ స్థలాలకు రూ.3 కోట్లు

Jul 19 2026 6:47 AM | Updated on Jul 19 2026 6:47 AM

● ఏడుపాయల్లో కాటేజీల నిర్మాణాలకు రూ.7 కోట్లు మంజూరు ● ఇటీవల ఖిల్లాను సందర్శించిన టూరిజం స్పెషల్‌ సెక్రటరీ వాణీప్రసాద్‌

ఖిల్లాపై సినిమా షూటింగ్‌

మెతుకుసీమ పర్యాటక సొబగులు అద్దుకోనుంది. చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉన్న జిల్లాను అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ ప్రత్యేక చొరవతో మెదక్‌ ఖిల్లాతో పాటు పలు దర్శనీయ స్థలాలకు రూ.3 కోట్లు మంజూరు కాగా, ఏడుపాయల్లో కాటేజీల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.7 కోట్లు విడుదల చేసింది.

– మెదక్‌జోన్‌

తాను హీరోగా చేయబోయే చిత్రం, లేదా నిర్మించే సినిమా షూటింగ్‌ మెదక్‌ ఖిల్లాపైనే చేస్తానని సినీ నటుడు మంచు విష్ణు తెలిపారు. శనివారం ఆయన మెదక్‌ జిల్లాలో పర్యటించారు. మొదట ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మెదక్‌ ఖిల్లా, చర్చిని సందర్శించి మాట్లాడారు. ఇతర దేశాలతో పోలిస్తే మన చరిత్ర 95 శాతం పదిలంగా ఉందని, ఇంతటి అద్భుతమైన ఖిల్లా నిర్మాణం హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉందని, దీని గురించి ఇప్పటికీ తెలుసుకోకపోవటంపై సిగ్గుపడుతున్నా అని అన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ నగేశ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధిక, వైస్‌ చైర్మన్‌ నరేష్‌గౌడ్‌, తదితరులు ఉన్నారు.

మెతుకుసీమకు ఘనమైన చరిత్ర ఉంది. 5 వేల సంవత్సరాలకు పూర్వం బుషులు తపస్సు చేసిన పుణ్యభూమిగా విరాజిల్లుతోంది. రాష్ట్రంలోనే ప్రసిద్ధిచెందిన ఏడుపాయల వనదుర్గామాత ఆలయం, కాకతీయుల కాలంలో నిర్మించిన మెదక్‌ ఖిల్లా, ప్రఖ్యాతిగాంచిన చర్చి, పోచారం ప్రాజెక్టు, దానిపక్కనే అభయారణ్యం, ఇలా ఎన్నో దర్శనీయ, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.

టూరిజం సర్క్యూట్‌ ఏర్పాటు

జిల్లాలోని దర్శనీయ స్థలాలన్నింటినీ అభివృద్ధి చేసి టూరిజం సర్క్యూట్‌గా ఏర్పాటు చేస్తే జిల్లాకు జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు రావటంతో పాటు అన్ని విధాలుగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్‌ భావిస్తున్నారు. దీంతో జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈక్రమంలోనే ఇటీవల రాష్ట్ర టూరిజం స్పెషల్‌ సెక్రటరీ వాణీప్రసాద్‌ను ఆహ్వానించి జిల్లాలోని చారిత్రక నేపథ్యం గల స్థలాల గురించి వివరించారు. దీంతో ఆమె టూ రిజం అభివృద్ధికి రూ. 3 కోట్లు మంజూరు చేశారు. అందులో రూ. 55 లక్షలు ఖిల్లా కోసం కేటాయించగా, మిగితావి ఇతర స్థలాల అభివృద్ధికి కేటాయించనున్నారు. అలాగే ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి రూ.7 కోట్లు మంజూరీ చేశా రు. వాటితో 12 కాటేజీలను నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

చారిత్రక ప్రదేశాల పరిశీలన

జిల్లాలో టూరిజంను అభివృద్ధి చేసేందుకు కలెక్టర్‌ ప్రత్యేకంగా ఇద్దరు ప్రైవేట్‌ కన్సల్టెంట్లను పిలిపించారు. వారు జిల్లాలో చారిత్రక నేపథ్యం గల ప్రదేశాలను పరిశీలించి రిపోర్టు ఇవ్వాలని చెప్పడంతో గత కొన్ని రోజులుగా వారు జిల్లాలోని దర్శనీయ, చారిత్రాక ప్రదేశాలను పరిశీలిస్తున్నారు. వాటిని అభివృద్ధి చేసేందుకు అయ్యే ఖర్చు, తదితర అంశాలపై క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement