● ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం ● జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్
చేగుంట(తూప్రాన్): రైతులు వర్షాభావానికి తగిన పంటలు వేసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ అన్నారు. శనివారం చేగుంట రైతు వేదికలో కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయగా, మంత్రి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గిపోయినట్లు తెలిపారు. రాబోయే రెండు నెలల్లో వర్షాలు పడే సూచనలు లేవని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారని తెలిపారు. రైతులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలు ప్రజలను రైతులను తప్పుదోవపట్టించే విధంగా చూస్తున్నారని, వారి మాటలు ఎవరూ నమ్మొద్దన్నారు. తాగునీటికి ఎలాంటి కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాబోయే పరిస్థితులకు అనుగుణంగా పంటలను పండించాలని వివరించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి జిల్లా వ్యవసాయ అధికారి విన్సెంట్ వినయ్‌కుమార్, తూప్రాన్ ఆర్డీఓ బావయ్య, మండల స్పెషల్ ఆఫీసర్ హేమాభార్గవి, ఏఎంసీ చైర్మన్ వెంగళ్‌రావు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనివాస్‌రెడ్డితో పాటు రైతులు పాల్గొన్నారు. అనంతరం చేగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ష్యూరీఫై సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, స్టడీ మెటీరియల్స్‌ను మంత్రి అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి పాఠశాల విద్యకు ప్రాముఖ్యత కల్పిస్తున్నారని తెలిపారు. డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ స్రవంతి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళ్‌రావు, మండల పార్టీ శాఖ అధ్యక్షుడు నవీన్, ఎంఈఓ నీరజ ఫౌండేషన్ ఎండీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


