తూప్రాన్: ఐరన్ పరిశ్రమతో ఇబ్బంది పడుతున్న మనోహరాబాద్ మండలంలోని రంగాయిపల్లి, చెట్లగౌరారం గ్రామాల ప్రజలకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని ఆపార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం ఆ రెండు గ్రామాల ప్రజలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పరిశ్రమతో తమ ప్రాణాలకు ముప్పు ఉందని, వెంటనే ఇతర ప్రాంతాలకు తరలించాలని ప్రజలు కోరారు. పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యంతో అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భజలాలు సౌతం కలుషితం అయ్యాయని వాపోయారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. పరిశ్రమ విస్తరణను అడ్డుకోవడంతో పాటు ఇతర ప్రాంతానికి తరలించేవరకు ప్రజల పక్షాన ఉద్యమిస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆదివారం పరిశ్రమ ఎదుట నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు.


