ర్యాగింగ్‌ చేస్తే కఠిన చర్యలే | - | Sakshi
Sakshi News home page

ర్యాగింగ్‌ చేస్తే కఠిన చర్యలే

Jul 8 2026 9:32 AM | Updated on Jul 8 2026 9:32 AM

ర్యాగింగ్‌ చేస్తే కఠిన చర్యలే ఎన్‌హెచ్‌–44పై నిఘా మరింత పటిష్టం రోడ్ల అభివృద్ధికి రూ.176.85 కోట్లు

జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు

మెదక్‌జోన్‌: ర్యాగింగ్‌ చట్టరీత్యా నేరమని దీనికి పాల్పడిన వారిపై కఠిన చర్యలకు సైతం ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. కళాశాలలు, హాస్టళ్లు ప్రారంభమైన నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..నూతనంగా చేరిన విద్యార్థుల పట్ల సీనియర్‌ విద్యార్థులు స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్నారు. నూతన విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేయడం, అవమానించడం, శారీరక లేదా మానసిక వేధింపులకు పాల్పడటం వంటి చర్యలు చట్టరీత్యా కఠిన చర్యలకు దారితీస్తాయని హెచ్చరించారు. విద్యాసంస్థల యాజమాన్యాలు యాంటీ ర్యాగింగ్‌ కమిటీలను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఎలాంటి వేధింపులు ఎదురైనా వెంటనే కళాశాల యాజమాన్యానికి లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మెదక్‌ జిల్లా పోలీసు శాఖ విద్యాసంస్థల పరిసరాల్లో ప్రత్యేక నిఘా కొనసాగిస్తుందన్నారు.

జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్‌ కుమార్‌సింగ్‌

తూప్రాన్‌: జాతీయ రహదారి–44పై భద్రతా పర్యవేక్షణను మరింత పకడ్బందీగా నిర్వహించాలని మెదక్‌ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్‌ కుమార్‌సింగ్‌ సూచించారు. మంగళవారం పట్టణ సమీపంలోని టోల్‌గేట్‌ వద్ద ఉన్న కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించి సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌హెచ్‌–44పై వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షిస్తూ అనుమానాస్పద వాహనాలు, వ్యక్తుల కదలికలను వెంటనే గుర్తించి సంబంధిత పోలీసు స్టేషన్లకు సమాచారం అందించాలన్నారు. సీసీ కెమెరాలు ఎప్పుడూ పనిచేసే స్థితిలో ఉండేలా నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం ద్వారా నేరాల నియంత్రణతోపాటు రహదారి భద్రతను మరింత బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు. అదనపు ఎస్పీ వెంట డీఎస్పీ నరేందర్‌గౌడ్‌, ఎస్సై గంగరాజు, సిబ్బంది ఉన్నారు.

నర్సాపూర్‌: నర్సాపూర్‌ నియోజకవర్గంలోని పలు రోడ్లను అభివృద్ధి చేసేందుకు రూ.176.85 కోట్లు మంజూరైనట్లు కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి వెల్లడించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ..నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తునన్నారు. హైబ్రీడ్‌ అన్యూటీ మోడల్‌(హెచ్‌ఏఎం) ప్రాజెక్టు కింద ఈ నిధులు వచ్చాయని చెప్పారు. ఈ నిధులతో ఆయా మండలాల్లోని 163.7 కిలో మీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రోడ్ల పనులు త్వరలో ప్రారంభమవుతాయని నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, దామోదర రాజనర్సింహ, వివేక్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

మల్లన్న ఆలయంలో వేలం పాటలు

కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయంలో మంగళవారం పలు అంశాలకు వేలం పాటలు నిర్వహించారు. ఈ సందర్భంగా లడ్డూ, పులిహోర తయారు చేసి అప్పగించే హక్కును కొమురవెల్లికి చెందిన సార్ల నర్సింహులు దక్కించుకున్నారు. అదే విధంగా ఆలయంలో ఫొటోలు, వీడియో తీసే లైసెన్సు హక్కును రావుల మధు దక్కించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ బుద్ది శ్రీనివాస్‌, పర్యవేక్షకులు చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement