మెదక్ కలెక్టరేట్ : మా పిల్లల సమస్య పరిష్కరించాలంటూ బెస్ట్ అవైలబుల్ పథకం విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం కలెక్టరేట్ వద్ద కలెక్టర్ ప్రతిమాసింగ్ కారును అడ్డుకున్నారు. జిల్లాలో బెస్ట్ అవైలబుల్ పథకం కింద ఎంపికై న 477 మంది విద్యార్థులు పలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన నిధులు రావడం లేదంటూ ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి విద్యార్థులను పాఠశాలల్లోకి రానివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీంతో పిల్లల తల్లిదండ్రులు పక్షం రోజులుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. సోమవారం సైతం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నంలోగా సమస్య పరిష్కరిస్తామని అదనపు కలెక్టర్ నగేశ్ హామీనివ్వడంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు. మంగళవారం సైతం సమస్య పరిష్కారం కాకపోవడంతో తల్లిదండ్రులు కలెక్టర్‌ను అడ్డుకొని ఆందోళనకు దిగారు. దీంతో కలెక్టర్ ప్రతిమాసింగ్ కారు దిగి చాంబర్‌లోకి వెళ్లగా తల్లిదండ్రులు కలెక్టర్ చాంబర్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. తమ పిల్లల సమస్య వెంటనే పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల అరుపులతో కలెక్టరేట్ దద్దరిల్లింది. విషయం తెలుసుకున్న మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ అక్కడికి చేరుకుని ఆందోళన విరమించాలని తల్లిదండ్రులను సముదాయించే ప్రయత్నం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అటు విద్యాసంస్థలు తమ పిల్లలను రానివ్వకపోవడంతో వారి భవిష్యత్ ఆగమైంతుందని, మరోవైపు వారికోసం కలెక్టరేట్‌కు తిరగడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన డీఎస్పీ హామీనివ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రులు శాంతించి ఆందోళన విరమించారు. ఈ విషయమై జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి సింధును వివరణ కోరగా మెదక్‌లోని పలు విద్యాసంస్థల యజమానులతో చర్చించి విద్యార్థులను పాఠశాలలను పంపించినట్లు తెలిపారు.
బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్
కలెక్టర్ కారు అడ్డగింత
కలెక్టర్ చాంబర్ ముందు బైఠాయించి ధర్నా


