బోరు బావుల కింద నాట్లు
ఆశల
● ఊపందుకున్న సాగు పనులు
● ఆరుతడి పంటలకు ఊపిరి
ఈ ఏడాది ఎల్‌నినోతో ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ అధికారులు ముందు నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వానాకాలం ప్రారంభం జూన్‌లో లోటు వర్షపాతం నమోదు కావటంతో వారి మాటలకు బలం చేకూరినట్లయింది. దీంతో అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈనెల ప్రారంభం నుంచి సాధారణం కన్నా రెండింతల వర్షం అధికంగా కురవడంతో వారిలో ఆశలు చిగురించాయి. ఫలితంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
– మెదక్‌జోన్
జిల్లావ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్‌లో 3.67 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అయితే ఏడాది ఎల్‌నినోతో ముప్పు పొంచి ఉందని, వర్షాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పంటలు సాగు చేయాలని, వరికి బదులు ఆరుతడి పంటల సాగు లాభదాయకమంటూ రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. అయినా రైతులు ఎప్పటిలాగే వరిసాగుకు మొగ్గు చూపారు. రోహిణి కార్తెలోనే బోరుబావుల ఆధారంగా తుకాలు (నారుమళ్లు) పోశారు. గత నెల అడపాదడపా కురిసిన వర్షాలకు వేసవి దుక్కులు దున్ని సాగుకు సిద్ధమయ్యారు. అదే విధంగా పత్తి విత్తనాలు వేశారు. కాగా, జూన్‌లో 112.4 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా, కేవలం 83.8 మి.మీ మాత్రమే కురిసింది. ఈ లెక్కన ఇంకా 28.6 మి.మీ మేర లోటు వర్షపాతం నమోదైంది. దీంతో అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. ఎల్‌నినోతో ముప్పు తప్పదేమోనంటూ ఆవేదన చెందారు. భూమిలో వేసిన విత్తును దక్కించుకునేందుకు నానాతంటాలు పడ్డారు. వివిధ మార్గాల ద్వారా నీటి తడులు అందించి విత్తును దక్కించుకున్నారు. కాగా, ఈనెల ప్రారంభం నుంచే జిల్లాలో వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన ఐదు రోజుల్లో సాధారణం కన్నా రెండింతలు కురిసింది. భూమి సమృద్ధిగా తడిసింది. ఫలితంగా వర్షాధారంగా సాగు చేసిన పత్తి, ఇతర ఆరుతడి పంటలకు ఊపిరి పోసినట్లు అయింది.
భూగర్భజలాలు ఆశాజనకం
గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం భూగర్భజలాలు సైతం బెటర్‌గా ఉన్నాయని ఆశాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది భారీ వర్షాలు కురవటంతో చెరువులు, కుంటలు సమృద్ధిగా నిండి ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. గతేడాది జూన్‌లో సగటున 14.31 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా, ఈ ఏడాది జూన్‌లో 13.30 మీటర్లలో ఉన్నాయి. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 1.01 మీటర్ల పైనే ఉంది. ఇది అన్నదాతలకు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.
గత వారం రోజులుగా సమృద్ధిగా వర్షాలు కురవటంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. అన్నదాతలు పొ లా ల్లో వివిధ పనులు చేస్తూ బిజీగా మారారు. కొందరు సాగునీటి ఆధారంగా బోరుబావుల కింద వరి నాట్లు ప్రారంభించారు. ఈ నెలాఖరు వరకు నాట్లు వేస్తేనే ఆశించిన దిగుబడి వస్తోందని, లేనిచో నష్టం వాటిళ్లే ప్రమాదం ఏర్పడుతుందని పేర్కొ ంటున్నారు.


