చిన్నశంకరంపేట(మెదక్): నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా జరగడం లేదని ఆగ్రహించిన మిర్జాపల్లి రైల్వేస్టేషన్ కాలనీ వాసులు ఆదివారం నార్సింగి– చిన్నశంకరంపేట ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. వర్షంలో తడుస్తూ రోడ్డుకు అడ్డంగా ఖాళీ బిందెలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా జరగకున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ తాగునీటి సరఫరా కాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.


