లీ‘డర్’..
దుర్గమ్మ సాక్షిగా అవినీతి ఏడుపాయలుగా పారుతోంది. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క దర్జాగా అక్రమాలకు పాల్పడుతున్నారు. జాతర కీర్తిని చాటాలని సర్కార్ నిధుల వరద పారిస్తే.. నిబంధనలకుపాతరేస్తున్నారు. పరదా చాటున పర్సంటేజీలు పంచుకుంటున్నారు. తామిచ్చిందేకొటేషన్ అంటూ రూ. కోట్లుకొల్లగొడుతున్నారు. తాత్కాలిక పనులతో మమ అనిపిస్తున్నారు. దుర్గమ్మకే శఠగోపం పెడుతున్న ఈ అక్రమార్కులపై
‘సాక్షి’ వరుస కథనాలు నేటి నుంచి..
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల జాతరలో నిబంధనలకు పాతరేస్తున్నారు. జాతర కీర్తిని నలుదిశలా చాటాలని రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద ఏటా రూ. 2 కోట్లు మంజూరు చేస్తుండగా.. తాత్కాలిక పనులతో హారతి కర్పూరం చేస్తున్నారు. గతేడాది ‘నో టెండర్.. తాము ఇచ్చిందే కొటేషన్’ అంటూ ఈఓను డమ్మీని చేసి, లీడర్లే నిబంధనలకు విరుద్దంగా పనులు చేశారన్న ఆరోపణలున్నాయి. బిల్లుల చెల్లింపు కొంత ఆలస్యమైనా, దుర్గమ్మ సొమ్మును కాంట్రాక్ట్ పనుల ద్వారా స్థానిక లీడర్లు.. అధికారులు.. ఏజెన్సీలు.. పప్పు బెల్లాల్లా వాటాలేసి పంచుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఎస్‌డీఎఫ్ వ్యయంపై ఆడిట్ లేకపోవడంతో అధికారులు జంకు లేకుండా అవినీతి దందాకు తెగబడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ నాయకులు ఏటా ఈ తంతును నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఈనెల 15 నుంచి మహాశివరాత్రి జాతర ప్రారంభం కానుండటంతో మళ్లీ పనుల పాతర మొదలైంది.
ఈఓ ద్వారా రూ. 93.04 లక్షలు
గత ప్రభుత్వ హయాం నుంచి ఏడుపాయల జాతరకు ఎస్‌డీఎఫ్ కింద నిధులు విడుదల చేస్తున్నారు. ప్రెస్ నోటిఫికేషన్ వేసి టెండర్ల ద్వారా పనులు చేస్తే దుబార నివారించవచ్చు. కానీ ఎస్‌డీఎఫ్ నిధులు ఏటా ప్రత్యేక జీఓతో విడుదల అవుతాయి. బిల్లులు వచ్చే సరికి సుమారు 10 నెలల కాలం పడుతుంది. దీనిని సాకుగా తీసుకొని, నిధులు మంజూరు కానిదే, పనులు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదంటూ, స్థానిక నాయకులు తమకు అనుకూలమైన ఏజెన్సీలను రంగంలోకి దించుతున్నారు. ఈఓను డమ్మీని చేసి కొటేషన్లు తీసుకొని జిల్లా అధికారులకు పంపుతున్నారు. వారు కొటేషన్‌లోని అంచనాలను కొంత తగ్గించి, ఫైనల్ చెల్లింపులు ఇస్తున్నారు. ఈ తతంగాన్ని ముందుగానే పసిగట్టిన ఏజెన్సీలు కొంత హెచ్చించి, లాభదాయకమైన రేట్లనే కోడ్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. కాగా ఏటా చేస్తున్న పనుల్లో అన్నీ తాత్కాలికమైనవే, పర్మనెంట్ పనులు ఒకటి, రెండు మాత్రమే చేస్తున్నారు.
వచ్చే జాతరకు పరిశీలిస్తాం
తాను ఇటీవలే ఏడుపాయల ఇన్‌చార్జి ఈఓగా బాధ్యతలు స్వీకరించాను. సమయం లేనందున ఎస్‌డీఎఫ్ నిధులకు సంబంధించి టెండర్లు నిర్వహించలేకపోయాను. ప్రస్తుతానికి గతేడాది లాగే కొటేషన్లు తీసుకొని, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, పనులు అప్పగిస్తాం. కొటేషన్లు స్వీకరించడానికి సమాచార నిమిత్తం ఎలాంటి పేపర్ నోటిఫికేషన్ వేయలేదు.
– వీరేశం, ఏడుపాయల ఈఓ


