గెలుపు గుర్రాల వడపోత
● ఆచితూచి అడుగులు వేస్తున్న పార్టీలు
● పూర్తిస్థాయిలో ఖరారు అభ్యర్థుల జాబితా
● అన్ని మున్సిపాలిటీల్లో విరివిగా నామినేషన్ల దాఖలు
‘పుర’ పోరుకు పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. పాత, కొత్త నేతలు అనే తేడా లేకుండా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నేతలు నిర్ణయించారు. ఇందుకోసం అభ్యర్థుల వడపోత ప్రారంభించారు. – మెదక్‌జోన్
జిల్లాలో మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీలు ఉండగా, వీటి పరిధిలో 75 వార్డులు ఉన్నాయి. నామినేషన్లకు ఒక రోజు గడువు మాత్రమే మిగిలి ఉంది. కాగా ఇప్పటివరకు పార్టీలు పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు. మెదక్ మున్సిపాలిటీలో మాత్రమే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఎన్నికల బరిలో నిలిచే కొంతమంది అభ్యర్థులను ఫైనల్ చేశాయి. మిగితా మూడు మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేదని తెలుస్తోంది. మెదక్ బల్దియాలో 32 వార్డులు ఉండగా, అధికార కాంగ్రెస్ 10 మంది అభ్యర్థులను, బీఆర్‌ఎస్ 18 మందిని ఫైనల్ చేసింది. కాగా స్క్రూట్నీ గడువు ఫిబ్రవరి 3 వరకు ఉంది. అప్పటివరకు బీఫాంలను నేరుగా అధికారులకే సమర్పించే అ వకాశం ఉండటంతో వేచిచూసే ధోరణిలో ఉన్నారు. అయితే నామినేషన్లు మాత్రం అన్ని మున్సిపాలిటీల్లో విరివిగా వేస్తున్నారు.
నేరుగా అధికారులకే బీఫాంలు
గతంలో ఎప్పుడూ లేని విధంగా మున్సిపల్ ఎన్నికలపై పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. మెదక్, రామాయంపేట బల్దియాలపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ రెండు మున్సిపాలిటీలు ప్రత్యేకంగా మారాయి. ఈ రెండింటిలో అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆశావహులకు ముందుగా టికెట్లు ఖరారు చేయ కుండా, నామినేషన్ వేయండని చెబుతున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ లోపు ఖరారు చేసి అధికారులకే నేరుగా బీఫాంలను అందించేందుకు కసరత్తు చేస్తున్నారు.
మౌనం వీడని బీజేపీ
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు విరివిగా నామినేషన్లు వేస్తున్నారు. బీజేపీ మాత్రం మౌనం ప్రదర్శిస్తోంది. రిజర్వేషన్లు ఖరారయ్యాక ఎంపీ రఘునందన్‌రావు, ఆ పార్టీ ముఖ్య నేతలు సమావేశం ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. షెడ్యూల్ విడుదల అయ్యి నామినేషన్లకు మరో రోజు మాత్రమే గడువు ఉన్నా, ఆ పార్టీలో సందడి కనిపించటం లేదు.


