తెగని టికెట్ల పంచాయితీ
మెదక్ కలెక్టరేట్: మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. జిల్లావ్యాప్తంగా నాలుగు ము న్సిపాలిటీల పరిధిలో 75 వార్డులు ఉన్నాయి. ఒక్కో కౌన్సిలర్ టికెట్‌కు నలుగురుకు పైగా పోటీ పడుతున్నారు. అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లో పోటీ తీవ్రంగా ఉంది. మాజీలతో పాటు కొత్తగా పోటీ చేయాలని పలువురు తహతహలాడుతున్నారు. ఖర్చుకు సైతం వెనుకాడబోమని.. టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. కాగా కాంగ్రెస్ ఏజెన్సీల ద్వారా వార్డుల వారీగా సర్వే చేయించింది. ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఉంటాయని ఆ పార్టీ నాయకులు బేరీజు వేస్తున్నారు. గట్టి అభ్యర్థులను ఎంపిక చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
ముందు ప్రకటించకుండా వ్యూహాలు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు చైర్మన్ అభ్యర్థులను ముందుగా ప్రకటించడం లేదు. అప్పటి పరిస్థితులను బట్టి ఎంపిక చేసే అవకాశం ఉంది. కాగా పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. ఇంటింటికీ తిరుగుతూ తమను ఆశీర్వదించాలని కోరుతున్నారు. కొంతమంది కే వలం డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలని చూస్తుండగా, మరికొంతమంది నిత్యం ప్రజల్లో ఉండేవారమని, తమను గెలిపిస్తే ఎటువంటి సమస్యనైనా పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నారు. కొంతమంది ఏ పార్టీ టికెట్ రాకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగాలని చూస్తున్నారు. మొత్తం మీద ఈసారి బ్యాలెట్ పేపర్‌లో 10 మందికి తక్కువ కాకుండా అభ్యర్థులు రంగంలో ఉండే అవకాశం ఉంది. కాగా నామినేషన్ వేసేందుకు నేడు ఆఖరిరోజు కావడంతో పార్టీ టికెట్ ఇస్తుందో లేదో? ఇవ్వకపోతే ఎట్లా అని ఆశావహులు ఆందోళనకు గురవుతున్నారు. ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. కొంతమంది చివరి వరకు నామినేషన్ దాఖలు చేయకుండా వేచి చూస్తున్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లో
తీవ్ర పోటీ


