కార్మిక చట్టాలకు తూట్లు
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు
మెదక్ కలెక్టరేట్: కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు తెలిపారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్‌లో సీఐటీయూ, ఏఐఏడబ్ల్యుయూ, ఏఐకేఎస్, ఎన్‌పీఆర్డీ, ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐలతోపాటు వృత్తిదారుల సమన్వయ కమిటీ సంఘాల సమావేశం నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బా లమణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చుక్కరాములు పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్రం రాకముందే కార్మికులు వారి హక్కుల కోసం పోరాడి కార్మిక చట్టాలు తెచ్చుకున్నారని తెలిపారు. అనేక త్యాగాలతో ఏర్పడిన చట్టాలు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తొలగించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అదానీ, అంబానీ చాకిరీ చేస్తూ దేశ సంపదను అప్పగిస్తున్నట్లు ఆరోపించారు. కార్మికులను బానిసలుగా మార్చేందుకే 4 లేబర్‌కోడ్‌లు తెచ్చారని మండిపడ్డారు.


