బల్దియా ఖజానా గలగల
మెదక్ కలెక్టరేట్/రామాయంపేట(మెదక్): ఎన్నికల పుణ్యమా అని మున్సిపాలిటీలకు ఆదాయం సమకూరుతోంది. పోటీ చేసేవారితో పాటు వారిని బలపర్చేవారు ఎలాంటి బకాయిలు ఉండరాదనే నిబంధనలున్నాయి. ఈమేరకు కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న వారితో పాటు వారిని బలపర్చేవారు సైతం బకాయిలు చెల్లిస్తున్నారు. రామాయంపేట మున్సిపాలిటీకి బుధవారం రూ. 2 లక్షల మేర ఆదాయం సమకూరింది. వీటిలో ఇంటి పన్నుకు సంబంధించి రూ. 1.30 లక్షలు, మిగితావి సర్టిఫికెట్ ఫీజు కింద వసూలయ్యాయి. అలాగే మెదక్ మున్సిపల్ కార్యా లయం అభ్యర్థులు, మద్దతుదారులతో కిటకిటలాడింది. కార్యాలయం ఎదుట ప్రత్యేక టెంట్ వేసి హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. అక్కడే ఆశావహులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. మరోవైపు ఇంటి, నీటి, ఆస్తి పన్నులు స్వీకరించారు. నోడ్యూ సర్టిఫికెట్లు అందజేశారు.
కమిషనర్‌ను నిలదీసిన ఆశావహులు
మిషన్ భగీరథ కనెక్షన్ ఉచితమని చెప్పి, ఇప్పుడు రూ. వేలల్లో బిల్లులు కట్టామంటున్నారు.. ఇదేంటని పలువురు ఆశావహులు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డిని నిలదీశారు. నో డ్యూ కోసం రూ. 1,500 తీసుకోవడం సరికాదని వాపోయారు. స్పందించిన కమిషనర్ ఎన్నికల నిబంధనల ప్రకారం తీసుకుంటున్నామన్నారు. నల్లా కనెక్షన్ మాత్రమే ఉచితమని, నీటి పన్నులు కట్టాల్సిందే నని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం బకాయిలన్నీ చెల్లించాలని సూచించారు.
పోటీ చేయాలంటే పన్ను కట్టాల్సిందే
కిటకిటలాడిన మున్సిపల్‌కార్యాలయాలు
నోడ్యూ సర్టిఫికెట్ల కోసం బారులు
బిల్లుల మోత
ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు అవసరమైన నోడ్యూ సర్టిఫికెట్ ఇచ్చేందుకు మున్సిపల్ అధికారులు ఒక్కొక్కరి వద్ద రూ. 1,500 వసూలు చేస్తున్నారు. నీటి పన్ను కింద రూ. 3,500 నుంచి రూ. 24 వేల వరకు బకాయిలు వసూలు చేస్తున్నారు. నీటి పన్ను లు రూ. వేలల్లో రావడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.


