అటవీ సంపద పెంచేందుకు చర్యలేవీ?
ఎంపీ రఘునందన్ రావు
నర్సాపూర్ రూరల్: దట్టమైన అడవులు, సంపద పెంచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారని అటవీశాఖ ఉన్నత అధికారులను మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. మంగళవారం నర్సాపూర్ అర్బన్ పార్క్ ఆవరణలోని ఎకో పార్కులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఒక రోజు మానవ – వన్యప్రాణి సంఘర్షణపై వర్క్ షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ హాజరై మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువైందన్నారు. అడవులను పెంచి కోతులు ఇతర వన్య ప్రాణులకు కావలసిన ఆహారం దొరికేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ఉన్న 765డి జాతీయ రహదారి వెడల్పునకు అనుమతులు ఇవ్వాలని కోరారు. గుమ్మడిదల నుంచి నర్సాపూర్ వరకు అటవీ ప్రాంతంలో ఉన్న రోడ్డుకు చాలా మలుపులు ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో రాజన్న సర్కిల్ సీసీఎఫ్ రామలింగం, మెదక్, కరీంనగర్, కామారెడ్డి, సిరిసిల్ల అటవీ, విద్యుత్, పశు సంవర్ధక, వ్యవసాయ, పోలీస్ శాఖల అధికారులు, మెదక్ డీఎఫ్‌ఓ జోజి తదితరులు పాల్గొన్నారు.


