పురపాలికలకు ఎన్నికళ
● ఇక సందడి షురూ
● ఊపందుకున్న చేరికలు
● నామినేషన్లకు సిద్ధమైన ఆశావహులు
రామాయంపేట(మెదక్): ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికల కళ వచ్చేసింది. ఎక్కడికక్కడ టికెట్లు ఆశిస్తున్న ఆయా పార్టీల ఆశావహలు అంతర్గత ప్రచారం నిర్వహించుకుంటున్నారు. ఇక జిల్లాలోని అన్ని ము న్సిపాలిటీలు మహిళలకే రిజర్వుడు కావడంతో చైర్మన్ పదవులకోసం ఎవరికి వారే తీవ్రస్థాయిలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రిజర్వేషన్లు అనుకూలించ ని ఆశావహులు ఇతర వార్డులపై దృష్టి సారించి ఇప్ప టికే ప్రచారం ప్రారంభించారు. పార్టీలు ఆశావాహులనుంచి దరఖాస్తులు స్వీకరించడంతోపాటు అభ్యర్థుల గెలుపు అవకాశాలపై సర్వే నిర్వహిస్తున్నాయి.
ఎవరికి వారు సర్వేలు
రామాయంపేట, మెదక్ మున్సిపాలిటీ బరిలో ఎవరిని బరిలోకి దింపితే గెలిచే అవకాశాలు ఉంటాయనే విషయమై నాయకులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు తమదైన శైలిలో వారు పావులు కదుపుతున్నారు. టికెట్ల కోసం అవసరమైతే పార్టీలు మారడానికి సైతం సిద్ధంగా ఉన్న కొందరు ఆశావహులు తమవంతు ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. గెలుపు అవకాశాలున్నవారిని పార్టీలో చేర్చుకొని టికెట్ కట్టబెట్టేందుకు సైతం పార్టీలు యత్నిస్తున్నాయి. జిల్లాలోని మెదక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, నర్సాపూర్ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మెదక్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న రామాయంపేట, మెదక్ మున్సిపాలిటీలను ఎలాగైనా కై వసం చేసుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రయత్నాలు చేస్తున్నారు.
నర్సాపూర్‌లో చేరికల పర్వం
నర్సాపూర్‌లో ప్రధాన పార్టీల్లో చేరికలు జోరుగా సాగుతున్నాయి. కుల సంఘాలకు ఆశావహులు తాయిలాలు ప్రకటిస్తున్నారు. తూప్రాన్ మున్సిపాలిటీ మాత్రం సిద్దిపేట జిల్లా గజ్వేల్ సెగ్మెంటు పరిధిలో ఉంది. గజ్వేలు ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తూప్రాన్‌లో పాగా వేయాలని అధికార కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. మంత్రి వివేక్ పలుమార్లు తూప్రాన్‌లో సమావేశాలు నిర్వహించారు.
రామాయంపేటలో విచిత్ర పరిస్థితి
రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో విచిత్ర పరిస్థితి నెలకొంది. టికెట్లకోసం అధికార పార్టీలో పోటీ నెలకొంది. ఎవరికి వారే తమకే టికెట్ వస్తుందనే భరోసాతో ప్రచారం ప్రారంభించేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడిని పార్టీలో చేర్చుకోవడానికి బీఆర్‌ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున గెలుపొందిన కౌన్సిలర్లు కొందరు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిపోయారు. పట్టణంలోని ఎనిమిదో వార్డులో టికెట్ కోసం తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు, బీఆర్‌ఎస్ తరఫున ఇద్దరు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన తమకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సరైన ప్రాధాన్యత దక్కలేదని కొందరు నాయకులు వాపోతున్నారు. అలాంటి వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జొన్నల బాలు తాజాగా మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే.


