విధుల్లో నిర్లక్ష్యం.. అందని ఆరోగ్యం
మంత్రివర్యా! పట్టించుకోరూ?
అల్లాదుర్గం(మెదక్): ఆరోగ్యశాఖ మంత్రి నియోజకవర్గంలో ప్రజలకు ఆరోగ్యం అందని ద్రాక్షగా మారింది. జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అస్తవ్యస్తంగా కొనసాగుతున్నాయి. పది గంటలు దాటితే తప్ప కేంద్రంలోకి సిబ్బంది అడుగుపెట్టడం లేదు. డాక్టర్‌తో పాటు సిబ్బంది తమ ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పల్లె దవాఖాన డాక్టర్లు ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించడంతో అవి మూతపడుతున్నాయి. మంగళవారం అల్లాదుర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సాక్షి విజిట్ చేయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
విధుల్లో నిర్లక్ష్యం
అల్లాదుర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పది మంది సిబ్బంది ఉన్నారు. ఉదయం 10 గంటలకు అటెండర్, హెల్త్ అసిస్టెంట్ మాత్రమే విధులకు హాజరయ్యారు. డాక్టర్ మాత్రం విధులకు హాజరు కాలేదని పలువురు రోగులు చెప్పారు. ముప్పారం పల్లె దవాఖానలో విధులు నిర్వహించవలసిన డాక్టర్ అల్లాదుర్గం ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ముప్పారం పల్లె దవాఖాన మూతపడింది. ఆశా వర్కరు కొద్దిసేపు విధులు నిర్వహించినట్టు గ్రామస్తులు తెలిపారు.
దవాఖాన ఉన్నా అందని వైద్యం
డాక్టర్ నిర్మల సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని పంచాయతీ సభలో గ్రామస్తులు అధికారుల దృష్టికి తెచ్చారు. అయితే తనకు అల్లాదుర్గం ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించాలని జిల్లా అధికారులు ఆదేశించినట్టు డాక్టర్ చెప్పారని గ్రామస్తులు తెలిపారు. పల్లె దవాఖాన ఉన్నా తమకు వైద్యం అందడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నాయకుల, అధికారుల అండదండలతో వైద్య సిబ్బంది విధులకు ఎగనామం పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
డాక్టర్ వేధిస్తున్నారు..
అల్లాదుర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ తమను వేధిస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ తమ ఫోన్లను తీసుకొని ఎవరికి ఫోన్ చేస్తున్నారు, నాయకులు, విలేకరుల నంబర్లు మీ వద్ద ఎందుకు ఉన్నాయని ప్రశ్నిస్తున్నట్లు వాపోయారు. డాక్టర్‌పై ఆరోపణలు వచ్చినా, ఎవరైనా విమర్శించినా తమనే నిందితులుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అస్తవ్యస్తంగా ఆరోగ్య కేంద్రాలు
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులు, సిబ్బంది
మూతపడిన పల్లె దవాఖాన
విధుల్లో నిర్లక్ష్యం.. అందని ఆరోగ్యం
విధుల్లో నిర్లక్ష్యం.. అందని ఆరోగ్యం
విధుల్లో నిర్లక్ష్యం.. అందని ఆరోగ్యం


