సమన్వయంతో పనిచేయండి
● అధికారులకు కలెక్టర్ ఆదేశం
● పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ
మెదక్ కలెక్టరేట్: మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డితో కలిసి మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాణి కుముదిని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి ఎస్పీ డీవీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారికి వివరించారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అన్ని కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయాలని, ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. సరిపడా సిబ్బంది, బ్యాలెట్ పేపర్లు అందుబాటులో ఉంచడంతో పాటు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాసరావు, జిల్లా సైనన్స్ అధికారి రాజిరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


