అభ్యర్థులు.. జర దేఖో
మున్సిపల్ ఎన్నికల నిబంధనలివే..
మెదక్ అర్బన్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులకు ఒకరు.. స్వతంత్ర అభ్యర్థులను 10 మంది బలపర్చాలి. ఒక అభ్యర్థిని ప్రతిపాదించిన వ్యక్తి మరో అభ్యర్థిని ప్రతిపాదించరాదు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాఽశం ఉన్నందున, ఆశావహులైన అభ్యర్థులు కనీస నిబంధనలు మొదలే తెలుసుకొని ఉంటే, నామినేషన్ సమయంలో ఇబ్బందులు ఉండవు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయాలంటే భారతీయ పౌరుడై, 21 సంవత్సరాలు నిండి ఉండాలి. మున్సిపల్ పరిధిలో ఏదేని ఒక వార్డులో ఓటరై ఉండాలి. కాంట్రాక్టర్ అయి ఉండరాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, సర్వీసు నుంచి తొలగించిన వా రు పోటీకి అనర్హులు. పార్టీ అభ్యర్థులైతే నిర్ణీత సమయంలో బీఫాం అందజేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే రూ. 1,250, ఇతరులు రూ. 2,500 డిపాజిట్ చెల్లించాలి. గ్రేడ్–1 మున్సిపాలిటీలో రూ. 5 లక్షలు, గ్రేడ్– 2లో రూ. 4 లక్షలు, గ్రేడ్– 3లో రూ. 3 లక్షలకు లోబడి ఎన్నికల వ్యయం చేయాలి. నామినేషన్ ఫారం వెంట ఆస్తులు, అప్పులు, ఆదాయం, కేసులు, వివరాలతో కూడిన అఫిడ విట్, అభ్యర్థి ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, పాన్‌కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అందజేయాలి. ఒక్క వ్యక్తి నాలుగు కంటే ఎక్కువ నామినేషన్లు వేయకూడదు.


