పనులు వడివడి
● మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రానుండటంతో.. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ● మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల చెక్కుల పంపిణీలు ● మంత్రులు దామోదర, వివేక్ సుడిగాలి పర్యటనలు
మంత్రుల హడావుడి..
ఆగమేఘాలపై అభివృద్ధి పనులు
అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పంపిణీల పేరుతో అధికార పార్టీ హడావుడి చేస్తోంది. ఒకటీ రెండు రోజుల్లో మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులోకి రానుండటంతోఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఆగమేఘాలపై ఆయా పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేస్తున్నారు. పనిలో పనిగా పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు యూనిట్లను అందజేస్తున్నారు.
– సాక్షిప్రతినిధి, సంగారెడ్డి
జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ మంగళవారం ఒక్క రోజే మూడు మున్సిపాలిటీల్లో పర్యటించారు. సంగారెడ్డి 254 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసిన దామోదర.. సంగారెడ్డి మున్సిపాలిటీలో రూ.31.70 కోట్ల అంచనా వ్యయం కలిగిన పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో హెచ్‌ఎండీఏ, సీడీఎంఏ నిధులతో రాజీవ్‌పార్కు సుందరీకరణ, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధులతో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి పథకం ఫిల్టర్ బెడ్ మరమ్మతు పనులకు శంకుస్థాపనలు చేశారు. అక్కడి నుంచి నేరుగా జోగిపేట్ మున్సిపాలిటీలోనూ మంత్రి పర్యటించారు. పట్టణంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.7.46 కోట్ల వడ్డీరుణాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. అలాగే 6,584 మంది మహిళా సభ్యులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. కాగా, సంగారెడ్డి మున్సిపాలిటీలో మూడు నెలల క్రితమే ప్రారంభించిన పనులకు ఎన్నికల వేళ శంకుస్థాపనలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం శంకుస్థాపనలు చేసిన వాటిలో కొన్ని ఇప్పటికే కొనసాగుతున్న పనులు కూడా ఉండటం గమనార్హం.
ఇన్‌చార్జి మంత్రి వివేక్ సైతం..
జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ సైతం నర్సాపూర్ మున్సిపాలిటీలో పర్యటించారు. ఇందిర మహిళా శక్తి సంబురాలు చేసి స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను ఇచ్చారు. మరోవైపు జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీల్లో సోమవారం ఇందిరమ్మ చీరలు, సదాశివపేట మున్సిపాలిటీలోనూ ఎస్‌హెచ్‌జీ మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. ఇలా పలు మున్సిపాలిటీల్లో వివిధ పనులకు శ్రీకారం చుట్టడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం కుదరదు. దీంతో ఎన్నికల ముందు వీటికి శ్రీకారం చుడితే ఈ బల్దియా ఎన్నికల్లో ఎంతో కొంత పార్టీ అభ్యర్థులకు మేలు జరుగుతుందని ఆ పార్టీ భావిస్తోంది. ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని.. ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారం చేసుకునేందుకు వీలు కలుగుతుందని హస్తం పార్టీ భావిస్తోంది.


