బాల్యవివాహాలపై అవగాహన
ఎల్లంకి డిగ్రీ కళాశాలలో
న్యాయ విజ్ఞాన సదస్సు
నర్సాపూర్ రూరల్: నర్సాపూర్‌లోని ఎల్లంకి డిగ్రీ కళాశాలలో మంగళవారం జూనియర్ సివిల్ కోర్టు ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్యవివాహాలు, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాలపై ఏజీపీ శ్రీధర్ రెడ్డి, లీగల్ సర్వీస్ న్యాయవాది స్వరూప రాణి, లోక్ అదాలత్ బెంచ్ సభ్యులు మధుశ్రీ అవగాహన కల్పించారు. ఎవరైనా బాల్యవివాహాలు, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల వంటి నేరాలకు పాల్పడితే జరిగే శిక్షలు, చట్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అశోక్, లీగల్ సర్వీస్ సిబ్బంది ఆంజనేయులు, వై శ్రీను, అరుణ, రాజులు పాల్గొన్నారు.
ప్రజల అవసరాలకనుగుణంగా పనిచేయాలి: డీపీఓ
మెదక్‌జోన్: ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య పేర్కొన్నారు. మంగళవారం నూతన సర్పంచ్‌ల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల విధులు, బాధ్యతలు, అధికారాల గురించి వివరించారు. ఏ అధికారాలు ఉన్నాయో తెలిస్తే గ్రామ పరిపాలనకు దోహద పడతాయని చెప్పారు. అలాగే ఒక సర్పంచ్ ఎమ్మెల్యే, ఎంపీలతో ఎలా సమన్వయం చేసుకోవాలో తెలుస్తుంది అన్నారు. విద్యార్థిలా శిక్షణ తరగతులలో చెప్పిన అంశాలను శ్రద్ధగా వినాలని, వాటిని ఆచరించాలని కోరారు. పంచాయతీ కార్యదర్శుల విధులు, అనుమతులు, ఉపాధి హామీ పథకం కింద గ్రామాలలో ఏమేమి పను లు చేయాలో శిక్షణ ద్వారా తెలుస్తుందన్నారు.
జంతు గణన ప్రారంభం
జిల్లా అటవీ అధికారి జోజి
రామాయంపేట, హవేళి ఘణపూర్ (మెదక్): జిల్లా వ్యాప్తంగా అటవీప్రాంతాల్లో జంతు గణన మంగళవారం ప్రారంభమైంది. ఈమేరకు జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌ఓ) జోజి హవేళి ఘణపూర్ మండలం తిమ్మాయపల్లిలో కార్యక్రమాన్ని సమీక్షించారు. ఈసందర్భంగా సిబ్బందికి సూచనలు చేశారు. పకడ్బందీగా గణన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా పరిధిలోని ఆరు రేంజీలు, 98 బీట్లలో మూడు రోజులపాటు మాంసాహార జంతు గణన కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈమేరకు బీట్లలో 176 మంది తమ సిబ్బందితోపాటు విద్యార్థులు గణన కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. ఆ తరువాత మూడు రోజులు శాకాహార జంతువుల గణన కొనసాగుతుందన్నారు. రామాయంపేట రేంజీ పరిధిలోని తొనిగండ్ల, అక్కన్నపేట అటవీప్రాంతంలో రేంజీ అధికారి విద్యాసాగర్ పాల్గొన్నారు.
గణతంత్ర వేడుకలకు
గుమ్మడిదల మహిళకు ఆహ్వానం
జిన్నారం(పటాన్‌చెరు)/సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు రావాల్సిందిగా గుమ్మడిదల పట్టణ కేంద్రానికి చెందిన చెన్నంశెట్టి మౌనికకు భారత ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ఈ మేరకు మంగళవారం మౌనిక విలేకరులకు వెల్లడించారు. సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో కాయిర్ బోర్డ్ మహిళా కాయిర్ యోజన కింద మౌనికతో పాటు తెలంగాణ ప్రాంతం నుంచి మరో నలుగురు మహిళా పారిశ్రామికవేత్తలకు కూడా ఈ ఆహ్వానాలు అందాయి.
తారా డిగ్రీ కళాశాల విద్యార్థి కూడా..
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రిపబ్లిక్ డే పరేడ్‌కు తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన తృతీయ సంవత్సరం విద్యార్థి చరణ్ రాజ్ ఎంపికయ్యారు. అదేవిధంగా రాష్ట్ర రిపబ్లిక్ డే పరేడ్ క్యాంపునకు నలుగురు తారా కళాశాల ఎన్సీసీ క్యాడేట్లు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ మీడియాకు వెల్లడించారు.
బాల్యవివాహాలపై అవగాహన
బాల్యవివాహాలపై అవగాహన


