ఎవరికి మంచి పేరుంది?
మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ రహస్య సర్వే
● అభ్యర్థుల గురించి
అడిగి తెలుసుకుంటున్న టీం
● ప్రభుత్వ పనితీరు, పథకాలపై ఆరా
మెదక్‌జోన్: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గులాబీ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది. ఓటరు నాడి తెలుసుకునేందుకు గత మూడు రోజులుగా వార్డుల్లో రహస్య సర్వే నిర్వహిస్తోంది. అభ్యర్థుల వ్యక్తిత్వంపై ఆరా తీస్తోంది. ఎవరికి బీఫాం ఇస్తే గెలుపు సునాయా సం అవుతుందని ప్రజలను అడిగి తెలుసుకుంటుంది. కాగా లోకల్ వ్యక్తులు సర్వేలో పాల్గొంటే ఓటర్లు వాస్తవాలను చెప్పరనే ఉద్దేశంతో కొత్త వ్యక్తులతో సర్వే చేయిస్తున్నారు. ఇప్పటికే నర్సాపూర్‌లో పూర్తి కాగా, మెదక్, రామాయంపేట, తూప్రాన్‌లో సర్వే కొనసాగుతోంది.
ఎవరు గెలిస్తే మేలు?
జిల్లాలోని మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ నాలుగు మున్సిపాలిటీల్లో గత మూడు రోజులుగా బీఆర్‌ఎస్ సర్వే చేయిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచింది. పింఛన్ సక్రమంగా ఇస్తున్నారా..? కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అందుతున్నాయా..? మహిళలకు రూ. 2,500, నిరుద్యోగ భృతి, రైతు భరోసా లాంటి పథకాల గురించి ఓటర్లను అడిగి తెలుసుకుంటున్నారు. గత ప్రభుత్వం మంచి చేసిందా..? ప్రస్తుత ప్రభుత్వం మంచి చేస్తుందా..? అంటూ ఇంటింటికీ తిరిగి ఓటర్లను అడిగి నమోదు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం మీ వార్డులో కౌన్సిలర్‌గా ఎవరికి మంచి పేరుందని ఆరా తీస్తున్నారు. కాగా ఈ సర్వే ఆధారంగానే బీఫాంలు ఇచ్చే అవకాశం ఉంది.
బీజేపీ ఊసెత్తడం లేదు
బీఆర్‌ఎస్ చేస్తున్న ఈ రహస్య సర్వేలో అధికార కాంగ్రెస్ గురించి మాత్రమే ఆరా తీస్తున్నట్లు తెలిసింది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిస్తే బెటరా..? కాంగ్రెస్ గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతుందా..? అంటూ సర్వేలో పాల్గొన్న వ్యక్తులు ఓటర్లను అడిగి తెలుసుకుంటున్నారు. కాగా బీజేపీ గురించి ఎక్కడా ఆరా తీయడం లేదని తెలిసింది.


