పుర పోరులో మీ పాత్ర కీలకం
మున్సిపల్ కమిషనర్లతో అదనపు కలెక్టర్ నగేశ్
మెదక్ కలెక్టరేట్: మున్సిపల్ ఎన్నికల్లో కమిషనర్ల పాత్ర కీలకమని, ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలకు ఏ సమయంలోనైనా నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉందన్నారు. అధికారులు విధుల నిర్వహణకు సంసిద్ధంగా ఉండాలన్నారు. నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి విధులు కేటాయించిన నోడల్ అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. గత పంచాయతీ ఎన్నికల నిర్వహణ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సమర్థ విధుల నిర్వహణకు తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 17 నుంచి సీఎం కప్
ఈనెల 17 నుంచి 22వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించే సీఎం కప్ క్రీడల విజయవంతానికి అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో సీఎం కప్ క్రీడలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అధికారులు అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు.


