స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా
రామాయంపేట(మెదక్): రామాయంపేటను స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హామీ ఇచ్చారు. బుధవారం పట్టణంలోని పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆర్పీఎల్ క్రికెట్ పోటీలను, మున్సిపాలిటీకి కొత్తగా మంజూరైన రెండు చెత్త సేకరణ ఆటోలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ వాసులు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్త బండిలోనే వేయాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకు ంటే వ్యాధులు ధరి చేరవని సూచించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని హితవుపలికారు. కొద్దిసేపు క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే సిక్స్ కొట్టి ఆలరించారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, మాజీ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమె యాదగిరి, పట్టణ పార్టీ అధ్యక్షుడు చింతల స్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా రామాయంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పక్కా భవనం మంజూరు చేయాలని కోరుతూ ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ ఎమ్మెల్యేక వినతిపత్రం అందజేశారు.
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్


