మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని రైతులు ఈ ఏడాది వానాకాలంలో సాగు చేసిన వరి పంట దిగుబడి ప్రారంభమైంది. వరికోతలు ముమ్మర మయ్యాయి. కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ఈ సీజన్ నుంచి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారు. కేంద్రంలో మౌలిక వసతులు, ధాన్యం తూకం, తరలింపు తదితర 16 రకాల నిబంధనలు విధించారు. ఇప్పటి వరకు జిల్లాలో ఒక కేంద్రం మాత్రమే నిబంధనల ప్రకారం వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వ్యాపారులు పచ్చివడ్లనే రూ.2,550 నుంచి రూ.2,700 వరకు కొనుగోలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వరకు క్వింటాల్ రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు ధాన్యం దిగుబడి వస్తున్న సమయంలో ధర తగ్గిస్తున్నారు. ఇటు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం, అటు మబ్బులు కమ్ముకుంటుండడంతో ధర తక్కువైనా మంచిదేనని రైతులు దళారులకే ధాన్యం విక్రయిస్తున్నారు.
ఆలస్యం వ్యాపారులకే మేలు..
ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై ఇప్పటికే అధికారులు సమీక్షలు నిర్వహించారు. పౌరసరఫరాల శాఖ అధికారులు ఇటీవల ధాన్యం సేకరణ కోసం వివిధ ఏజెన్సీల నిర్వాహకులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్, మెప్మా ఏజెన్సీల ఆధ్వర్యంలో 292 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల ప్రారంభం ఆలస్యమయ్యే కొద్దీ రైతులు దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది.
తగ్గుతున్న ధర..
ప్రస్తుతం మార్కెట్లో సన్నరకం బియ్యానికి డిమాండ్ భారీగా పెరిగింది. సన్నరకం వడ్లకు కూడా ఇతర జిల్లాల్లో క్వింటాలుకు రూ.3,200 నుంచి రూ.3,400 మధ్య కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర సాధారణ రకానికి క్వింటాలుకు రూ.2,440, ఏ గ్రేడ్ సన్నరకానికి రూ.2,460, రాష్ట్ర ప్రభుత్వ బోనస్ రూ.500 కలిపి రూ.2,960 నిర్ణయించారు.
అధికంగా పత్తి, వరి సాగు
ఈ ఖరీఫ్‌లో జిల్లాలో 3.23 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో 1.72 లక్షల ఎకరాల్లో పత్తి, 1.48 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 80 శాతం రైతులు సన్నరకం ధాన్యం సాగు చేశారు. ప్రస్తుతం దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్, మంచిర్యాల, నస్పూర్ మండలాల్లో పంట దిగుబడులు వస్తున్నాయి. 3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. ఇందులో రైతుల అవసరాలకు పోనూ 1.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నారు.
తగ్గిన దిగుబడి..
ఎకరాకు 40 నుంచి 50 బస్తాల వరకు దిగుబడి రావాల్సి ఉండగా ఎల్‌నినో ప్రభావంతో 25 నుంచి 35 బస్తాలు మాత్రమే వస్తుందని రైతులు వాపోతున్నారు. అరకొరగా వచ్చిన పంట ఇంట్లో నిల్వ చేసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


