ఖాళీ స్థలాలపై కన్ను! | - | Sakshi
Sakshi News home page

ఖాళీ స్థలాలపై కన్ను!

Nov 6 2026 1:38 AM | Updated on Nov 6 2026 1:38 AM

లేఅవుట్‌ వెంచర్లలో మున్సిపాలిటీ స్థలాలు మాయం

మంచిర్యాల కార్పొరేషన్‌లో రూ.కోట్ల విలువైన స్థలాలు కబ్జా

ప్రహరీలు నిర్మించకపోవడంతో అక్రమార్కుల ఇష్టారాజ్యం

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌లో గతంలో ఏర్పాటు చేసిన లేఅవుట్‌ వెంచర్‌లో 10 శాతం మున్సిపాలిటీకి వదిలేసిన ఖాళీ స్థలాలపై కబ్జాదారులు కన్నేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు, నగరపాలక సంస్థగా మారడంతో భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఏరియాను బట్టి గజం రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు పలుకుతోంది. దీంతో ప్రధాన రహదారులకు సమీపంలో ఉన్న వాటితో పాటు, కాలనీల్లో ఏర్పాటు చేసిన లేఅవుట్‌ వెంచర్లలో వదిలేసిన స్థలాలు కాపాడేందుకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచి గతంలోనే రూ.10 లక్షల నిధులు కేటాయించినా టెండరు ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో స్థలాల చుట్టూ ప్రహరీల నిర్మాణం జరగకపోవడంతో పలువురు కబ్జాకు యత్నిస్తున్నారు.

నిబంధనల మేరకు వదిలి.. ఆపై కబ్జా

మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 42 అనుమతులు పొందిన లేఅవుట్‌ వెంచర్లు ఉన్నాయి. ఇందులో మున్సిపాలిటీకి వదిలేసిన వాటిలో 72 ఖాళీ స్థలాలు ఉన్నాయి. అందులో కొన్ని పార్కులుగా, క్రీడా స్థలాలుగా ప్రజా వినోద కార్యక్రమాలు, ఇతర మున్సిపల్‌ అవసరాల కోసం వాడుతుండగా కొన్నిచోట్ల మాత్రం ఖాళీగానే ఉన్నాయి. కొన్నింటికి ప్రహరీ లేకపోవడంతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. లేఅవుట్‌ వెంచర్ల ఏర్పాటు కోసం డీటీసీపీ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ ప్లానింగ్‌) అనుమతులు తీసుకుని, లేఅవుట్‌ మొత్తం విస్తీర్ణంలో 10 శాతం స్థలాలను వదిలేశా రు. వీటితో పాటు పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు వంటి సామాజిక వసతుల కల్పన కోసం అదనంగా 2.5 శాతం స్థలాలను సైతం కేటాయించారు. రోడ్లు, అంతరంగిక రహదారులకు పోనూ మిగతా వాటిని ప్లాట్లుగా చేసి అమ్ముకున్నారు. లేఅవుట్లలో వదిలేసిన 10 శాతం ఖాళీ స్థలాలను మున్సిపల్‌ పరంగా వినియోగించని వాటిపై కబ్జాదారుల కన్నుపడింది. గతంలో పాతమంచిర్యాలలో లేఅవుట్‌ చేసిన ఓ వెంచర్‌ను 20 ఎకరాలతో ఏర్పాటు చేసి గుడి, బడి కోసం వదిలేసిన స్థలాన్ని, సాయిబాబా గుడి సమీ పంలోని పార్కు స్థలాన్ని, పాతమంచిర్యాల సబ్‌స్టేషన్‌ సమీపంలోని ఓ వెంచర్‌లోనూ గుడి, బడి, పార్కు స్థలాలు, ఐబీ చౌరస్తా సమీపంలోని వెంచర్‌లోని పార్కు స్థలాన్ని గతంలోనే అమ్ముకున్నారు. ఇటీవల హైటెక్‌సిటీ కాలనీలోని లేఅవుట్‌ వెంచర్‌లో పాఠశాల, కమ్యూనిటీ హాల్‌ కోసం వదిలేసిన ఖాళీ స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నించగా, కాలనీవాసులు అడ్డుకోవడంతో మున్సి పల్‌ కార్పొరేషన్‌ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. రెడ్డికాలనీలోని సర్వే నంబర్‌ 194లో లేఅవుట్‌ వెంచర్‌లో మున్సిపాలిటీ కోసం వదిలేసిన 400 గజాల ఖాళీస్థలం కబ్జా చేయగా, మంగళవారం అధికారులు ప్రహరీలు తొలగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement