దండేపల్లి: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి నది ఒడ్డున గల శ్రీపద్మల్‌పురి కాకో ఆలయంలో గురువారం గుస్సాడీ దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మల్‌పురి కాకో ఆలయానికి ఎంతో చరిత్ర ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు కృషి చేస్తున్నారన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ ఏటా దండారీ ఉత్సవాలతో పాటు, మిగతా సమయాల్లోనూ భక్తులు కాకో ఆలయానికి వస్తుంటారన్నారు. భక్తుల సౌకర్యార్థం గోదావరి నది వద్ద పుష్కర ఘాట్లు, మరుగుదొడ్లు నిర్మించాలని, ఐటీడీఏ అధికారులతో మాట్లాడామన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బాపురావు, డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, గిరిజన కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోట్నాక తిరుపతి, ఆర్‌జీపీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, సర్పంచ్ కళావతి, రాయిసెంటర్ జాతీయ అధ్యక్షుడు అర్జు, తుడుందెబ్బ మండల అధ్యక్షుడు జంగు, ఆదివాసీ సంఘాల నాయకులు జలపతి, జంగు, తదితరులు పాల్గొన్నారు.
అధికారుల గైర్హాజర్
గుస్సాడీ దర్బార్‌కు ఏ ఒక్క అధికారి కూడా హాజరు కాకపోవడంతో ఆదివాసీ సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దర్బార్ వేళ ఆదివాసీలు అందరూ ఒక్కచోట కలుస్తారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహించిన దర్బార్‌కు అధికారులు హాజరు కాకపోవడం గమనార్హం.


