ఖానాపూర్: మండలంలోని కొత్తపేట గ్రామంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. గ్రామానికి చెందిన చింతకుంట శంకర్ ఇంటికి వేసిన తాళాన్ని పగులగొట్టి లోపలికి చొరబడిన దొంగలు బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు అపహరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు తులాల బంగారం, 15 తులాల వెండి పట్టగొలుసులు, రూ.30వేల నగదు చోరీకి గురైనట్లు పేర్కొన్నాడు. భార్య, పిల్లలు బతుకమ్మ సంబరాల కోసం పెంబి మండలం మందపల్లికి వెళ్లగా, శంకర్ పని నిమిత్తం వెంకటాపూర్‌కు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడినట్లు బాధితుడు తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు.


