ఐక్యతతోనే హక్కులు సాధ్యం | - | Sakshi
Sakshi News home page

ఐక్యతతోనే హక్కులు సాధ్యం

Oct 24 2026 12:10 AM | Updated on Oct 24 2026 12:10 AM

● ఎంపీ గోడం నగేశ్‌, ఎమ్మెల్యే బొజ్జు ● ఇంద్రవెల్లిలో భీమ్‌ విగ్రహావిష్కరణ ● హాజరైన ఉమ్మడి జిల్లా ఆదివాసీలు

ఇంద్రవెల్లి: జల్‌.. జంగల్‌.. జమీన్‌ నినాదంతో పోరాటం చేసిన మహనీయుడు కుమురం భీమ్‌ను ఆదర్శంగా తీసుకుని ఐక్య పోరాటాలు చేస్తేనే హక్కులు సాధించుకోవచ్చని ఎంపీ గోడం నగేశ్‌, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ పేర్కొన్నారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, మాజీ ఎంపీ సోయం బాపూరావ్‌, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆదివాసీ నాయకులతో కలిసి మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన కుమురం భీమ్‌ కాంస్య విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. ముందుగా ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ఆదివాసీలు అమరవీరుల స్తూపం నుంచి వందల సంఖ్యలో డోలు వాయిద్యాలతో ర్యాలీగా కుమురం విగ్రహాం వద్దకు చేరుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, రాయిసెంటర్‌ సార్మెడిలు, ఆదివాసీ పెద్దలతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడారు. ఆదివాసీ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఆదివాసీ ఆచారాలను పాటిస్తూనే పిల్లల చదువులపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం పోటీ తత్వంతో ముందుకు సాగాలని సూచించారు. ఆదివాసీ గిరిజనులు ఏ పార్టీలో ఉన్నా జాతి కోసం సమన్వయంతో పని చేసి ఆదివాసీ సమాజాభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. అనంతరం ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురువక రైతులు వానాకాలంలో సాగు చేసిన పంటలకు నష్టం వాటిల్లిందని, జిల్లా పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి కరువు జిల్లాగా ప్రకటించేలా కృషి చేయాలని రాయిసెంటర్‌ సార్మెడిలు ఎమ్మెల్యే, ఎంపీకి విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర ఎమ్మెల్యే రాజు తోడసం, కుమురం భీమ్‌ మనుమడు సోనేరావ్‌, రాయిసెంటర్‌ జిల్లా మేడి తోడసం అమృత్‌రావ్‌, రాయిసెంటర్‌ సార్మెడిలు మెస్రం వెంకట్‌రావ్‌, చిన్ను పటేల్‌, దుర్గు, కొట్నాక్‌ దేవ్‌షావ్‌, కుమురం భీమ్‌ నిర్వహణ కమిటీ చైర్మన్‌ నాగ్‌నాథ్‌, ఆయా సంఘాల రాష్ట్ర నాయకులు మెస్రం మనోహర్‌, ముఖడే విష్ణు, తుడుందెబ్బ నాయకులు గోడం గణేశ్‌, మైపతి అరుణ్‌కుమార్‌, పుర్క బాపురావ్‌, ఆదివాసీ మండల నాయకులు పుర్క చిత్రు, గేడం భరత్‌, జుగ్నాక్‌ భరత్‌, ఆర్క ఖమ్ము తదితరులున్నారు.

మార్మోగిన ఇంద్రవెల్లి

కుమురం భీమ్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆదివాసీల సంప్రదాయ డోలు, పేప్రే, ఖాళి కోం వాయిద్యాలతో ఇంద్రవెల్లి మార్మోగింది. ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన ఆదివాసీలు అమరవీరుల స్తూపం నుంచి కుమురం భీమ్‌ విగ్రహాం వరకు వందలాదిగా తీసుకువచ్చిన డోలు వాయిద్యాల మధ్య ర్యాలీగా చేరుకున్నారు. ఆదివాసీ సంప్రదాయం, సంస్కృతి, ఐక్యతను చాటిచెప్పేలా నిర్వహించిన వాయిద్యాల ప్రదర్శన ఆకట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement