ఆభరణాల వెంట తరలిన ప్రతీ భక్తుడు గడముంతలు లేదా తమ పాత్రల్లో గోదావరి జలాలను తీసుకువచ్చారు. ఆ నీటితో అమ్మవారిని అభిషేకించడంతో పాటు ఇళ్లు, పంటపొలాల్లో చల్లి భక్తిని చాటుకున్నారు. ఆలయంలో పసుపుతో అభిషేకాలు చేసి అదే పసుపును పంటపొలాల్లో చల్లారు. దీనివల్ల పాడిపంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని భక్తుల విశ్వాసం. ఆలయ కోనేరులో పవిత్ర స్నానాలు ఆచరించి గంటలపాటు క్యూలో నిలబడి దర్శనం చేసుకున్నారు. సమీప గ్రామాల ప్రజలు చెట్ల కింద వంటలు చేసి నైవేద్యాలు సమర్పించి అక్కడే భోజనాలు చేశారు.


