ఉదయం 6 గంటలకు సాంగ్వి ఆలయం నుంచి ప్రారంభమైన గంగనీళ్ల జాతర అడెల్లి దేవస్థానం వైపు తిరుగు పయనమైంది. కంజర్, బన్సపల్లి, దిలావర్పూర్, మాడేగాం, కదిలి గ్రామాల్లో ఘనస్వాగతం పలికారు. దిలావర్పూర్లో జాలుక దండ (భారీ పూలతోరణం)తో స్వాగతం ఇచ్చారు. పోతరాజులు అమ్మవారికి పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. భక్తులు అమ్మవారికి గొర్రెపిల్లలు బహూకరించారు. శివసత్తులు పూనకాలతో పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ముందుకు సాగారు. దారి పొడవునా ఆభరణాలపై పసుపు నీళ్లు చల్లుతూ టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.


